Kerala Plane Crash : పైలట్ కు ఎంతో అనుభవం..ఎందుకిలా జరిగింది ?

  • Publish Date - August 8, 2020 / 07:27 AM IST

Kerala Plane Crash అందర్నీ కలిచివేసింది. కేరళ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. క్షేమంగా గమ్యస్థానానికి చేరాల్సి ఉండగా విమానం రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. వీరిలో పైలెట్, కో పెలెట్ కూడా ఉన్నారు. దీపక్ వసంత సాథే..విమానాలు నడపడంలో అత్యంత అనుభవం ఉంది.



ఇదివరకు భారత వాయు సేనలో యుద్ధ విమానాలు నడిపారు. ఖరాక్ వస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో 58వ కోర్స్ కు చెందిన వారు. అంతేకాదు..పెలెట్లకు శిక్షణ ఇచ్చారు. ఎయిర్ ఫోర్స్ లో ఉండగా..58 ఎన్డీయే ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి గౌరవ ఖడ్గాన్ని కూడా అందుకున్నారు.



కోజికోడ్ లో ప్రమాదానికి గురైన బోయింగ్ 737 విమానాలు నడపడంలో పైలెట్ వసంత సాథే అందెవేసిన చెయ్యి. ఎయిర్ ఇండియా కోసం.. ఆయన ఎయిర్ బస్ 310 విమానాలు కూడా నడిపారు. ఎంతో అనుభవం ఉన్నా..ప్రమాదం జరగడం పట్ల ఎంతో మంది దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.



కేరళలోని కోజికోడ్ లో విమానం రన్ వేపై దిగే సమయంలో..కుదుపులకు లోనై..రన్ వైప్ దూసుకపోయింది. పక్కనే ఉన్న లోయలో పడి రెండు ముక్కలైంది. ప్రమాదం ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైలెట్ కు అనుభవం ఉన్నా..వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదంటున్నారు.



వర్షం పడడం రన్ వే చిత్తడిగా ఉందని, విమానం దిగగానే..టైర్లు పట్టు కోల్పోయి ఉండొచ్చునని కొందరు అంటున్నారు. ఎంతో అనుభవం ఉన్న పైలట్ దీపక్ వసంత సాథే విమానాన్ని కంట్రోల్ చేయలేకపోయారంటే..ప్రమాద తీవ్రతను అంచనా వేసుకోవచ్చంటున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.