ఇదొక రికార్డు : రైల్వే మొత్తం వైఫై

  • Publish Date - November 21, 2019 / 03:06 AM IST

ఉచితంగా వైఫై అందించడంలో సౌత్ సెంట్రల్ రైల్వే రికార్డు సృష్టించింది. జోన్‌లోని అన్ని స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన దేశంలోని రెండో జోన్‌గా ఘనత సాధించింది. ప్రస్తుతం 574 స్టేషన్‌లో ఈ వసతిని కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్ టెల్ ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా ఈ సదుపాయాన్ని అందచేస్తున్నారు. హాల్టింగ్ స్టేషన్లు మినహా జోన్‌లోని అన్ని ఏ – 1 కేటగిరి నుంచి ఎఫ్ కేటగిరీ స్టేషన్ల వరకు హై స్పీడ్ వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

తక్కువ సమయంలో వైఫై సేవలు ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను జీఎం అభినందించారు. స్టేషన్ పరిధిలోకి వచ్చిన వారు ఫోన్ ద్వారా ఫ్రీగా వైఫై సేవలు పొందవచ్చు. 2015లో మొట్టమొదట ఏ – 1 స్టేషన్ అయిన సికింద్రాబాద్‌లో ఉచిత వైఫై ప్రారంభించారు. ఇప్పటి వరకు 5 ఏ – 1 స్టేషన్లు, 31 ఏ కేటగిరి స్టేషన్లు, 38 బీ కేటగిరీ స్టేషన్లు, 21 సీ కేటగిరి స్టేషన్లు, 78 డీ కేటగిరి స్టేషన్లు, 387 ఇ కేటగిరీ స్టేషన్లు, 2 ఎఫ్ కేటగిరీ స్టేషన్లు, 12 కొత్త రైల్వే స్టేషన్‌లలో వైపై సేవలను అందుబాటులో ఉన్నాయి. 
Read More :చిక్కుల్లో చెన్నమనేని : ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశం