కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశాలకు ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. త్వరలోనే తిరిగి వస్తారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. రాహుల్ ధ్యానం చేసుకునేందుకు తాను తరచుగా వెళ్లే ప్రాంతానికి వెళ్లారని ఆయన తెలిపారు. నవంబర్ 5 నుంచి ఆర్థిక మందగమనం, రైతాంగ సంక్షోభం తదితర సమస్యలపై దేశవ్యాప్తంగా పోరాటాలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
అయితే ఆ ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన సమావేశానికి రాహుల్ హాజరయ్యారని సూర్జేవాలా తెలిపారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర,హర్యానా ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఈ నెల ప్రారంభంలో రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే రాహుల్ విదేశీ పర్యటనపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
రాహుల్ తన సొంత నియోజకవర్గం కన్నా విదేశాలకే ఎక్కువగా వెళ్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు విమర్శించారు. తన విదేశీ పర్యటన వెనక ఉద్దేశ్యం,పర్యటనల వివరాలను,ప్రతీ పర్యటనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నవి అన్న వివరాలను రాహుల్ తప్పనిసరిగా పార్లమెంట్ కు తెలియజేయాలని జీవీఎల్ అన్నారు. రాహుల్ గాంధీని ఫ్రీక్వెంట్ ఫ్లయర్ గా అభివర్ణించారు. గడిచిన 5ఏళ్లలో రాహుల్ 16సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారని జీవీఎల్ అన్నారు.