Success Story: కూలి నాలి చేసుకునే స్టేజ్ నుంచి జడ్జి.. వావ్, వాట్ ఏ సక్సెస్ జర్నీ..
మొదటి ప్రయత్నంలోనే 26వ ర్యాంకు సాధించారు. ఇది సాధారణ విషయం కాదు.

కూలి నాలి చేసుకునే స్టేజ్ నుంచి జడ్జి స్థాయికి ఎదిగాడు ఓ యువకుడు. ఆయన సక్సెస్ జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. మహారాష్ట్రలోని హింగోలికి చెందిన అనికేత్ కోక్రే జీవితంలో ఎదురైన ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని ఛేదించి, నిరంతర శ్రమతో కెరీర్‌లో విజయాన్ని సాధించారు.
ఓ చిన్న రైతు కుటుంబంలో జన్మించిన అనికేత్‌కి జీవితమే ఒక పెద్ద పోరాటం. ఆయన తల్లిదండ్రులు రోజువారీ కూలీగా పని చేసేవారు. తల్లిదండ్రుల కష్టాలను చూసిన అనికేత్‌కి తన కుటుంబాన్ని ఎలాగైనా కష్టాల నుంచి బయటపడేయాలన్న తపన కలిగింది.
అనికేత్ ప్రాథమిక విద్యను అఖడా బాలాపూర్ జెడ్‌పీ పాఠశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం నాందేడ్‌లోని నారాయణరావు చవాణ్ లా కాలేజీలో చేరి LLB, LLM పూర్తిచేశారు. చదువుకునే రోజుల్లో అనికేత్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవి సెలవుల్లో ఔరంగాబాద్‌లో రోజువారీ కూలీ పనులు చేస్తూ తన పుస్తకాలు, ఫీజుల కోసం డబ్బు సంపాదించేవారు.
2021లో LLM పూర్తి చేసిన తర్వాత, అనికేత్ సివిల్ జడ్జ్ పరీక్షకు సిద్ధం కావడానికి పుణెలోని గణేశ్ శిర్సాట్ అకాడమీలో చేరారు. ఒక ప్రణాళిక ప్రకారం ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు చదువుతూ ఉండేవారు.
MPSC సివిల్ జడ్జ్ పరీక్షను రాశారు. మొదటి ప్రయత్నంలోనే 26వ ర్యాంకు సాధించారు. ఇది సాధారణ విషయం కాదు. ఇది అనికేత్ ఆత్మవిశ్వాసానికి, తల్లిదండ్రుల త్యాగానికి, గురువుల మార్గదర్శకత్వానికి ప్రతిఫలం.
తన విజయం గురించి అనికేత్ మాట్లాడుతూ.. గంటల కొద్దీ చదవడం కంటే శ్రద్ధపెట్టి చదవడం ముఖ్యమని, ఇప్పుడు తనను చూసి ఎందరో యువత స్ఫూర్తిని పొందుతున్నారని చెప్పారు. న్యాయవ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకురావాలనుకుంటున్నానని తెలిపారు.