Rahul Gandhi arrested on his way to UP ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌లో గ్యాంగ్ రేప్‌కు గురై హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం మృతిచెందిన యువతిని అదే రోజు అర్థరాత్రి రహస్యంగా యూపీ పోలీసులు దహనం చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇవాళ ఆ యువతి తల్లితండ్రులను కలుసుకునేందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ వెళ్లారు. వాహనాల్లో వెళ్లాలనుకున్న ఆ ఇద్దర్నీ పోలీసులు అడ్డుకున్నారు. హత్రాస్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రేటర్ నోయిడా వద్ద రాహుల్ వాహనాన్ని నిలిపేశారు.
అయితే వాహనాలు దిగిన రాహుల్, ప్రియాంకాలు.. వందకుపైగా కిలోమీటర్ల దూరంలో ఉన్న హత్రాస్‌కు కాలినడకన వెళ్తున్నారు. ఆ సమయంలో పోలీసులు తనను నెట్టివేసినట్లు రాహుల్ ఆరోపించారు. తనపై లాఠీచార్జ్ కూడా చేసినట్లు ఆయన ఆరోపించారు. తనను నేలపై పడేసినట్లు రాహుల్ తెలిపారు. కేవలం మోడీజీ మాత్రమే ఈ దేశంలో నడుస్తారా అని రాహుల్ ప్రశ్నించారు. ఓ సాధారణ వ్యక్తి కనీసం నడవలేరా అని ఆయన నిలదీశారు. కాగా,పోలీసులు రాహుల్ ను అరెస్ట్ చేశారు
కాగా, రెండు వారాల క్రితం యూపీలోని హత్రాస్ లో 19 ఏళ్ళ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి, వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెకు తొలుత అలీఘర్‌లో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. పక్షవాతంతో పాటు శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలుగా చిత్రవధ అనుభవించిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ మంగళవారం సఫ్దర్ జంగ్ హాస్పిటల్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
మరోవైపు, ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. పోలీసులు అర్థరాత్రి వేళ ఆ యువతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం వివాదానికి దారి తీసింది. తమను ఇంట్లో నిర్బంధించి బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే యువతి తండ్రి, సోదరుడి అనుమతితోనే రాత్రివేళ అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.