Gautam Adani : ఆసియా కుబేరుల్లో అదానీ నెం.2

Gautam Adaniప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంపద అంతకంతకూ పెరిగిపోతోంది. షేర్ మార్కెట్లో అదానీ సంస్థల షేర్ల ర్యాలీ కొనసాగుతుండటంతో… ఆయన సంపద పెరుగుతూ వస్తోంది. దీంతో ఇప్పుడు ఆయన ఆసియా లో రెండో అతిపెద్ద కుబేరుడుగా అవతరించారు.

తాజాగా బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించిన ప్రకారం…ఇప్పటిదాకా ఆసియా నెం.2గా కొనసాగిన చైనా పారిశ్రామికవేత్త జోంగ్‌ షాన్షాన్‌ ఆస్తి 6,360 కోట్ల డాలర్లకు పడిపోయింది. అదానీ గ్రూప్‌ షేర్ల ర్యాలీతో గురువారం నాటికి గౌతమ్‌ అదానీ వ్యక్తిగత సంపద 6,650 కోట్ల డాలర్లకు (సుమారు రూ.4.86 లక్షల కోట్లు)పెరిగింది. దీంతో షాన్షాన్‌ను వెనక్కి నెట్టి గౌతమ్ అదానీ రెండో స్థానానికి ఎగబాకారు. ఈ ఏడాదిలో అదానీ ఆస్తి 3,270 కోట్ల డాలర్లు పెరగగా..షాన్షాన్‌ ఆస్తి 1,460 కోట్ల డాలర్లు క్షీణించింది.

ఇక,ఆసియాలో నెం.1 ధనవంతుడిగా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కొనసాగుతున్నారు. ముఖేశ్ అంబానీ ఆస్తి 7,650 కోట్ల డాలర్లు(5.58లక్షల కోట్లు)గా ఉంది. ఆసియా కుబేరుల్లో అదానీ 2వ స్తానానికి చేరడంతో..ఆసియాలో కుబేరుల్లో మొదటి,రెండో స్థానంలో భారతీయులు ఉన్నట్లయింది. ప్రపంచ కుబేరుల విషయానికి వస్తే.. అంబానీ 13వ స్థానం, అదానీ 14వ స్థానంలో కొనసాగుతున్నారు. షాన్షాన్ 15వ స్థానానికి పడిపోయారు.

ట్రెండింగ్ వార్తలు