Blooming flowers : కశ్మీర్ లోయకు సంగీత సవ్వడులనిచ్చిన తొలి ‘సూఫీ గర్ల్స్’..వారు గొంతెత్తితో మైమరచిపోవాల్సిందే

Kashmir

Kashmir Girls Sufi music : కశ్మీర్ అనగానే కాల్పులు, తీవ్రవాదుల మధ్య నలిగిపోయే ప్రాంతమే గుర్తొస్తుంది. ప్రకృతి రమణీయతకు నెలవైనా ఇవే ఎక్కువ గుర్తొస్తాయి.. ఎక్కువగా ముస్లింలు నివసించే కశ్మీర్ ప్రాంతంలో అమ్మాయిలపై చాలా ఆంక్షలుంటాయి.వారికి ఎవ్వరూ తోడు లేకుండా బయటకు పంపరు. వారిలో ఉండే ఎన్నో కళలు ఆంక్షలతో వెలుగులోకి రానేరావు. ఆటలైనా..పాటలైనా వారిలో ప్రతిభను బయటపెట్టటానికి లేదనే చెప్పాలి. పైగా ముస్లింల కుటుంబాల్లో ఈ ఆంక్షలు చాలా ఎక్కువగా ఉంటాయి.కానీ ఆంక్షల సంకెళ్లను తెంచుకుని వారిలోని ప్రతిభతో ఎంతోమందిని మంత్ర ముగ్గుల్ని చేస్తున్నారు కొంతమంది బాలికలు. సంగీతంతో గొంతు విప్పుతూ అందరిని ఆకట్టుకుంటున్నారు.

కశ్మీర్‌ లోయలో ఆడపిల్లలు లోయకు గొంతునిచ్చారు. తమ తీయని గొంతులోంచి ‘వికసించే పూలు’ పేరుతో ఒక సూఫీ సంగీత బృందంగా ఏర్పడ్డారు. వారి గొంతు విప్పారంటే మైమరచిపోవాల్సిందేనన్నట్లుగా ఉంటుంది. వారే పాడతారు. వారే వాయిద్యాలు కూడా వారే వాయిస్తారు. కశ్మీర్‌ మొత్తంలో ఆ మాటకొస్తే దేశంలోనే ఇటువంటి సర్వ మహిళా సూఫీ గీత బృందం లేదు. తుపాకలు మోతతో మారుమ్రోగే కశ్మీర్ లోయకు అమ్మాయిల గొంతుతో సూఫీ సంగీత మధురిమలను పరిచయం చేశారు. వారి సూఫీ సంగీతాన్ని..గానాన్ని విని కొంతమంది ఇదేంటీ ఆడపిల్లలు సంగీత బృందమా? అంటూ నొసలు చిట్లించేవారు సైత వారు గొంతు ఎత్తగానే అప్రయత్నంగా కనులు విప్పారుస్తున్నారు. ఔరా..ఏమీ మధురమైన సంగీతం..ఎంత శ్రావ్యమైన గొంతు అని ఈ సూఫీ గర్ల్స్‌ ని మెచ్చుకుంటున్నారు.

ఈ అమ్మాయిలు అలా చెట్ల మధ్యగా నడుచుకుంటూ వెళ్లి ఏ చెట్టు కిందో కూర్చుంటారు. లేదా ఓ తివాచీమీద కూర్చుంటారు.కూడా తెచ్చుకున్న వాయిద్యాలు పట్టుకుని చక్కగా కూర్చుంటారు. కమ్మాయి సంతూరును సవరిస్తుంది. ఒకమ్మాయి తబలా దవువేస్తుంది. మరో అమ్మాయి కశ్మీరి వయొలిన్‌లో కంపనం తెస్తుంది. ఆ తరువాత మెల్లగా అందరూ పాటలు మొదలెడతారు. వారి సంగీతానికి వారి గానానికి ప్రకృతి సైతం పులకించిపోయి వింటుంది. వారు పాడేది సూఫీ భక్తి సంగీతం కనుక. కశ్మీర్‌లో గత రెండేళ్ల నుంచి ఈ బాలిక సూఫీ బృందం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈఅమ్మాయిలు తమ బృందం ‘వికసించే పూలు’.అని పేరు పెట్టుకున్నారు.

లోయలో బృంద గీతం ప్రస్థానం
కశ్మీర్‌ బండిపోర జిల్లాలో గనస్థాన్‌ అనే చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో ఇర్ఫానా యూసఫ్‌ అనే కాలేజీ అమ్మాయి మొదలు పెట్టింది. ఆ అమ్మాయి తండ్రి సంగీత విద్వాంసుడు. సాయంత్రమైతే ఇంట్లో సంగీతం వెల్లివిరిసేది. ఆ సంగీతం వింటూ..వాయిద్యాలు చూస్తూ పెరిగిన ఆ అమ్మాయికి తబలా, సితార్, సంతూర్‌ తీసి సాధన చేస్తుండే తండ్రిని చూసి సహజంగానే సంగీతం మీద ఆసక్తి పెరిగింది. తండ్రిని చూసి..ఇర్ఫానా కూడా నేను కూడా నేర్చుకుంటానని తండ్రిని అడిగింది. కానీ తండ్రి సంచయించాడు. పట్టించుకోలేదు. కారణం.. సంగీత వాయిద్యాలను అమ్మాయిలకు నేర్పడం అంటే ఆ ప్రాంతంలో పట్టింపులున్నాయి. కానీ కూతురు పట్టుదల..సంగీతం మీద ఆసక్తి గమనించిన ఆ తండ్రి పట్టు వదిలాడు. ఆ ప్రాంతంలోని ఉస్తాద్‌ ముహమ్మద్‌ యాకూబ్‌ షేక్‌ అనే గురువు దగ్గరకు తీసుకువెళ్లి నా కూతురికి సంగీతం నేర్పమని చేర్పించాడు. ఉస్తాద్‌ ముహమ్మద్‌ షేక్‌ ఆ ప్రాంతంలో అమ్మాయిలకు సంగీతం నేర్పిన తొలి గురువు కావటం గమనించాల్సిన విషయం.

సంగీతం మగవారిది మాత్రమే కాదు అమ్మాయిలది కూడా అని అతని విశ్వాసం. ఆయనకు ఉన్న పేరుకు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. అలా ఇర్ఫానా సంగీతం నేర్చుకోవటానికి మార్గం సుగమమైంది. తన సంగీతాన్ని నేర్చుకున్న సంగీతాన్ని దూరదర్శన్‌లో ఓ ప్రోగ్రామ్ ద్వారా ప్రదర్శించింది. అంతే…ఆ గనస్థాన్ పల్లెలో టీవీలో ఆ కార్యక్రమాన్ని చూసిన ఎంతోమంది అమ్మాయిలు ఇర్షానాను చూసి స్ఫూర్తిపొంది.. తాము కూడా సంగీతం నేర్చుకోవాలని ఉబలాటపడ్డారు. ఎంతగానంటే.. ‘మనమంతా చక్కగా సంగీతం నేర్చుకుని ఓ బృందంగా ఏర్పడి కచ్చేరీలు ఇద్దాం’ అని అనేంతగా..ఇర్ఫానాకు కావలసింది అదే. లోయలో సంగీతం వినిపించాలని…‘సూఫీ సంగీతం ఓ ప్రత్యేకమైనది. ఈ సంగీతంలో దేవుణ్ణి, ప్రవక్తని, పీర్లను స్తుతించేదిగా ఉంటుంది. వారి గొప్పతనాన్ని శ్లాఘించడం, కృతజ్ఞతను ప్రకటించడం ఆ పాటల్లో ఉంటుంది.

కశ్మీరీ ఫోక్‌లోర్‌ పాడే బృందాలు కశ్మీర్‌లో చాలానే ఉన్నాయి. కాని సూఫీ సంగీతం పాడే బృందాలు లేవు. మగవారే పాడుతున్నారు. కశ్మీర్‌ అంతటా ఉర్సుల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, ఇళ్లల్లో జరిగే ఉత్సవాల్లో సూఫీ సంగీతం వినిపించడం ఆనవాయితీ. పారశీ, కశ్మీరీ భాషల్లో కశ్మీర్‌ ప్రాంతంలోని సూఫీ గురువులు పూర్వం రాసిన గీతాలను లయబద్ధంగా పాడటం అక్కడ ఎంతో ఆదరంతో చూస్తారు. ‘సూఫీ సంగీతంలో 12 నిర్దేశిత స్వరాలు ఉంటాయి. వాటిలోనే పాడాలి. వాటిలో కొన్ని స్వరాలకు కొన్ని సమయాలు ఉంటాయి. ఉదాహరణకు మొకామ్‌-ఏ-కూహి స్వరాన్ని రాత్రి తొలిజాము లోపల పాడేయాలి. ఆ తర్వాత పాడకూడదు. కొన్ని సాయంత్రాలు మాత్రమే పాడాలి’ అంటుంది ఇర్ఫానా. ఈ అమ్మాయిల తల్లిదండ్రులందరూ వీరి పాటకు సమ్మతించారు. కొందరు మొదట ‘ఆడపిల్లలకు పాటలా’ అని అన్నా తర్వాత ఈ బృందానికి వస్తున్న పేరును ప్రోత్సహిస్తున్నారు. ‘మా దగ్గర నిన్నమొన్నటి వరకూ సొంత వాయిద్యాలు లేవు. కాని మా కచ్చేరీలు మొదలయ్యాక వచ్చిన డబ్బుతో వాటిని కొనుక్కున్నాం. అందుకు దాదాపు లక్ష రూపాయలు అయ్యింది’ అంది ఫర్హానా.

యూనివర్సిటీలోనూ
కశ్మీర్‌ యూనివర్సిటీలో సంగీత వాయిద్యాల శాఖ ఉంది. ఫర్హానా అక్కడ సంతూర్‌ వాయిద్యం లో శిక్షణ కోసం చేరినప్పుడు ఆ అమ్మాయితో పాటు మరొక్క అమ్మాయి మాత్రమే ఆ కోర్సులో ఉండేది. ఏ అమ్మాయిలు నేర్చుకోవటానికి వచ్చేవారు కాదు. దీంతో అక్కడి వాయిద్యాలన్నీ దుమ్ము పట్టేసి ఉండేవి. ఈ క్రమంలో ఈ ‘వికసించే పూలు’ అమ్మాయిల బృందానికి మంచి పేరు రావటంతో ఎంతోమంది అమ్మాయిలు వాయిద్యాలు నేర్చుకోవడానికి వస్తున్నవారి సంఖ్య పెరిగింది.

అలా వాయిద్యాలు వాయించటానికి వచ్చే అమ్మాయిలు మాట్లాడుతూ..‘మేము యూనివర్సిటీలోనూ.. నేర్చుకుంటున్నాం. ఇంటికి వచ్చి సంప్రదాయబద్ధంగా గురువు దగ్గరా నేర్చుకుంటున్నాం. సంగీతం నేర్చుకోవడం అంటే అంత ఈజీ కాదు..ఆషామాషీ అసలే కాదు. అంటారీ అమ్మాయిలు. దేశంలో అన్ని ప్రాంతాల్లోలాగే సంప్రదాయ కశ్మీర్‌లో కూడా ఆధునిక పోకడలు ఎప్పుడో మొదలయ్యాయి. దీంతో కళ, సాంస్కృతిక రంగాలలో పట్టింపులు..చాదస్తాలు తగ్గాయి. దీంతో ఆంక్షలు కూడా కాస్త కాస్తగా సడలుతున్నాయి.దీంతో కశ్మీర్‌లో కళా వికాసం జరుగుతోంది. ప్రోత్సాహం దక్కితే ఇటువంటి ఎంతోమంది అమ్మాయిలు ఇంకా ముందుకు తీసుకెళ్లటానికి సిద్ధంగా ఉన్నారు.

‘వికసించే పూలు’ బృందానికి పలు నగరాల నుంచి ఆహ్వానాలు కూడా అందుతున్నాయి. లాక్‌డౌన్‌ లేకపోతే వారు ఈ సరికి వారి సంగీతం..గానం మన దేశమంతా ప్రతిధ్వనించేది. తమ పాటలు..సంగీతం గురించి ఈ ‘వికసించే పూలు’ ఏమంటున్నాయంటే..పారశీ గీతాలు మాకు తెలియకపోయినా పెద్దల నుంచి అర్థం తెలుసుకుని పాడుతున్నాం’ అని అంటున్నాయి.