Goa govt’s law department gives nod for ganja cultivation గంజాయి సాగుచేసేందుకు గోవా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఔషధ ప్రయోజనాల కోసం పరిమితస్థాయిలో మారిజువానా(గంజాయి)సాగుచేసేందుకు అనుమతించాలని ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనకు తమ డిపార్ట్మెంట్ అనుమతిచ్చినట్లు గోవా న్యాయశాఖ మంత్రి నిలేష్ కాబ్రాల్ తెలిపారు. న్యాయబద్ధమైన అంశాలను పరిశీలించి అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు.
1985లో నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్(NDPS)కింద గంజాయి మొక్క నిషేధిత జాబితాలో చేరిందని కాబ్రాల్ తెలిపారు. గంజాయి మొక్కలు నాటేందుకు ఇప్పుడు అనుమతిచ్చామని..దీంతో ఫార్మాకంపెనీలకు ఈ సాధారణ డ్రగ్ అమ్మబడుతుందని తెలిపారు.
కాగా,గంజాయి సాగు విషయంలో గోవా ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. బుధవారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన గోవా కాంగ్రెస్ ప్రతినిధి అమర్నాథ్ పంజికర్…బీజేపీ ప్రభుత్వం సాధ్యమైనంత తక్కువస్థాయికి దిగజారిపోయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు చట్టవిరుద్దమని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడకంపై గోవా ఫైట్ చేస్తున్న ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం..రాష్ట్ర సామాజిక వ్యవస్థలోకి డ్రగ్ మరింతగా వచ్చేందుకు దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పంజికర్ డిమాండ్ చేశారు.
గంజాయిని చట్టబద్దం చేయడం..బహిరంగ దుర్వినియోగానికి దారితీస్తుందని,ప్రశాంతమైన గోవా వాతావరణాన్ని నాశనం చేస్తుందని మాజీ మంత్రి,స్వతంత్ర ఎమ్మెల్యే రోహన్ కౌంటీ తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కౌంటీ డిమాండ్ చేశారు.