విద్యార్థులకు గుడ్ న్యూస్, టీసీ లేకున్నా ప్రభుత్వ స్కూల్స్‌లో అడ్మిషన్‌

  • Publish Date - August 30, 2020 / 09:31 AM IST

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభ సమయంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ వినిపించింది. టీసీ(transfer certificate) లేకున్నా ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులకు పెద్ద ఊరట ఇచ్చింది. ప్రైవేట్ స్కూళ్ల వేధింపులతో విసిగిపోయిన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్ల హోరు:
ప్రైవేటు స్కూళ్లలో ఇదివరకు చదువుకుని ఉన్న పక్షంలో, ఆ విద్యార్థులు టీసీలు సమర్పించకుండానే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందే వెసులుబాటను తమిళనాడు విద్యాశాఖ కల్పించింది. ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల ఒత్తిడి తీసుకొస్తుండడంతో చర్యలు తప్పవని విద్యాశాఖా మంత్రి సెంగోట్టయన్‌ హెచ్చరించారు. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు.. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుంటున్న తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అనేక మంది ప్రస్తుతం మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలల్లో అడ్మిషన్లు హోరెత్తుతున్నాయి.

ఫీజులు చెల్లిస్తేనే టీసీ అంటూ వేధింపులు:
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి లేక ఆదాయం లేక అవస్థలు పడుతున్నారు. అయితే, ఇది వరకు తమ పిల్లలు చదువుకున్న ప్రైవేట్ స్కూల్స్ టీసీలు ఇవ్వడంలో జాప్యం చేయడం, ఫీజులు చెల్లిస్తేనే టీసీ అంటూ వేధిస్తున్నట్టుగా విద్యాశాఖకు ఫిర్యాదులు పెరిగాయి. అదే సమయంలో ఒక తరగతి నుంచి మరో తరగతిలో చేరాలంటే ప్రభుత్వ పాఠశాలలో టీసీ సమర్పించాల్సి ఉంది. అయితే, ప్రైవేటు విద్యా సంస్థలు టీసీలు ఇవ్వకుండా వేధిస్తుండడంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పలేదు. దీనిపై విద్యాశాఖకు ఫిర్యాదులు హోరెత్తాయి.

సర్కారీ బడుల్లో చేరే విద్యార్థులకు శాలువాతో సత్కారం:
దీనిపై స్పందించిన విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూల్స్ లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు టీసీ సమర్పించకుండానే అడ్మిషన్లు పొందేందుకు వెసులుబాటు కల్పిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులను ఈరోడ్‌లో శాలువాతో సత్కరించి మరీ ఉపాధ్యాయులు ఆహ్వానిస్తుండడం విశేషం. ఇక, అడ్మిషన్లను పరిగణించి ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లోనే ఉండాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.

ఫీజుల పేరుతో వేధిస్తే చర్యలు:
ప్రైవేటు విద్యా సంస్థలకు విద్యాశాఖా మంత్రి సెంగోట్టయన్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఫీజుల పేరిట తల్లిదండ్రుల్ని వేధిస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వస్తే, ఆయా విద్యా సంస్థలపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు ఒకటో తరగతిలో లక్షా 72 వేల మంది కొత్తగా చేరారని, సెప్టెంబరులోనూ అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలల్లో సాగుతాయని తెలిపారు. పాఠ్యపుస్తకాలన్నీ సిద్ధంగానే ఉన్నాయని, కొత్తగా చేరే విద్యార్థులకు 14 రకాల వస్తువులను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. నీట్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు తగ్గ చర్యలపై సీఎంతో సమీక్షించనున్నామన్నారు.