Google Search: గూగుల్‌కు నచ్చని కన్నడ భాష.. చివరికి క్షమాపణలు!

ఎవరి భాష మీద వారికి అభిమానం ఉంటుంది. ఉండాలి కూడా. మరీ ముఖ్యంగా మన దక్షణాదిలో ఈ భాషాప్రేమ ఈ మధ్య కాస్త పెరుగుతూనే ఉంది. ఉత్తరాది ఆధిపత్యంతో దక్షణాది భాషల మీద చిన్నచూపు నెలకుంటుందనే వాదనలు ఎక్కువవుతున్నాయి.

Google Search

Google Search: ఎవరి భాష మీద వారికి అభిమానం ఉంటుంది. ఉండాలి కూడా. మరీ ముఖ్యంగా మన దక్షణాదిలో ఈ భాషాప్రేమ ఈ మధ్య కాస్త పెరుగుతూనే ఉంది. ఉత్తరాది ఆధిపత్యంతో దక్షణాది భాషల మీద చిన్నచూపు నెలకుంటుందనే వాదనలు ఎక్కువవుతున్నాయి. అలాంటి తరుణంలో గూగుల్ సెర్చ్(Google Search)లో అత్యంత అంద‌విహీన‌మైన భాష ఏది అంటే క‌న్న‌డ (Kannada Language) అని చూపించడంతో కన్నడ ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది.

ఇండియాలో అగ్లీయెస్ట్ లాంగ్వేజ్ (ugliest language in India) ఏది అని గూగుల్ లో సెర్చ్ చేస్తే క‌న్న‌డ అని రిజల్ట్ వచ్చింది. ఇది కాస్త కన్నడ ప్రజలలో ఆ నోటా ఈ నోటా ప్రచారం జరిగి భాషా వాదులు, ప్రభుత్వం వరకు వెళ్ళింది. దీనిపై క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంతోపాటు వివిధ పార్టీలు, భాషా సంఘాలు, భాషాభిమానులు, అక్క‌డి ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేకత వ‌చ్చింది. చివరికి గూగుల్‌కు లీగ‌ల్ నోటీసు జారీ చేస్తామ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించే వరకు వెళ్లడంతో వెంట‌నే దిగి వ‌చ్చిన గూగుల్ కన్నడ ప్రజలకు క్ష‌మాప‌ణ చెప్పింది.

అత్యంత అంద‌విహీన‌మైన భాష కన్నడ అని ఫలితాలు చూపించిన గూగుల్ కు లీగ‌ల్ నోటీసు జారీ చేస్తామ‌ని క‌న్న‌డ‌, సాంస్కృతిక‌, అట‌వీశాఖ మంత్రి అర‌వింద్ లింబావ‌ళి ఇప్పటికే స్ప‌ష్టం చేశారు. ఆ త‌ర్వాత ట్విట‌ర్‌లోనూ గూగుల్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌న్న‌డ భాష‌కు 2500 ఏళ్ల చ‌రిత్ర ఉండగా.. త‌రాలుగా క‌న్న‌డిగుల‌కు భాష గ‌ర్వ‌కార‌ణంగా నిలిచింద‌ని లింబావ‌ళి అన్నారు. క‌న్న‌డిగుల‌ను అవ‌మానించిన గూగుల్ వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆయన డిమాండ్ చేశారు.

భాషపై మొదలైన ఈ వివాదాన్ని ఆపేందుకు ఓ గూగుల్ అధికార ప్ర‌తినిధి స్పందించారు. ముందుగా కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పిన గూగుల్ సెర్చ్(Google Search) ఫ‌లితాలు ప్ర‌తిసారీ ప‌ర్ఫెక్ట్‌గా చూపించ‌వ‌ని, అలా కనిపించే ఫలితాలన్నీ నిజాలు కూడా కావని.. ఒక్కోసారి ఆశ్చ‌ర్య‌క‌ర ఫ‌లితాలు కనిపిస్తాయని అన్నారు. దీనిపై తాము త‌గిన చ‌ర్య తీసుకుంటామ‌న్న గూగుల్ కనిపించే ప్రతి సెర్చ్ ఫ‌లితాలు గూగుల్ అభిప్రాయం కాద‌న్న విష‌యాన్ని కూడా గ‌మ‌నించాల‌ని ప్రతినిధి కోరారు. ప్రస్తుతానికి ఈ భాషా వివాదం అలా సద్దుమణిగింది.