Govt Should Print Money Increase Spending Chidambaram
P Chidambaram 2020-21 ఆర్థిక సంవత్సరాన్ని–“నాలుగు దశాబ్దాలలో ఆర్థిక వ్యవస్థ యొక్క చీకటి సంవత్సరం”గా అభివర్ణించారు మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, కాంగ్రెస్ ఎంపీ పీ చిదంబరం. 2020-21 సంవత్సరానికి జీడీపీ మైనస్ 7.3 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.
మంగళవారం ఓ ప్రకటనలో చిదంబరం మాట్లాడుతూ…దేశ ఆర్థికరంగాన్ని నిర్వహించడంలో కేంద్రం తీరుపై చిదంబరం విమర్శలు గుప్పించారు. గతేడాది జులైలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన “గ్రీన్ షాట్స్” వ్యాఖ్యలను ఉదహరిస్తూ..కేంద్రప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని చిదంబరం విమర్శించారు.
ఎకానమీ..V-షేప్ రికవరీ ఉంటుందంటూ కరోనా మొదటి దశ సమయంలో నిర్మలా సీతారామాన్,చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కే సుబ్రమణ్యన్ అంచనావేశారని..ఇదంటూ తప్పుడు కథ అని చిదంబరం అన్నారు. దీనిపై తాము ఆనాడే అభ్యంతరం వ్యక్తం చేశామని,ఎకానమీ కోలుకుంటున్నట్లు సంకేతాలు కనిపించడం లేదని చెప్పామన్నారు. ఆర్థికరంగాన్ని ఊతమిచ్చేలా పేదలకు నేరుగా నగదు పంపిణీ,ప్రభుత్వ వ్యయం పెంచడం వంటి అనేక కీలక సూచనలు చేసినప్పటికీ కేంద్రప్రభుత్వం వాటిని పట్టించుకోలేదన్నారు. ఫలితంగా నెగిటివ్ గ్రోత్(మైనస్ వృద్ధి)నమోదైందని చిదంబరం అన్నారు.
ప్రస్తుతం ఉన్న తరుణంలో అవసరమైతే ప్రభుత్వం కరెన్సీని కొంచెం ఎక్కువ ముద్రించాలని చిదంబరం అన్నారు. ప్రభుత్వం ఈ దశలో చాలా ధైర్యంగా అడుగువేసి ఖర్చును పెంచాలని చిదంబరం సలహా ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ దీనావస్థకు చేరిందని, లక్షల సంఖ్యలో జనం దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని ఆయన అన్నారు. అప్పుచేసైనా, కరెన్సీ ముద్రించి అయినా..ప్రభుత్వం డబ్బును మాత్రం ఖర్చు చేయాలన్నారు.