బలమైన గోడ : CAAని నిరసిస్తూ..కేరళలో భారీ మానవహారం

  • Publish Date - January 26, 2020 / 01:20 PM IST

CAAకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఇంకా ఆందోళనలు, నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. CAA, NRC, NPRలను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. వీటిని అమలు చేయమని కేరళ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూ వస్తోంది. వెంటనే వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది అక్కడి ప్రభుత్వం.

 

తాజాగా 2020, జనవరి 26వ తేదీ ఆదివారం భారీ మానవహారం చేపట్టింది. దాదాపు ఏడు మిలియన్ల మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు. సీఎం పినరయి విజయన్ కూడా పాల్గొని తమ నిరసనను తెలియచెప్పారు. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

620 కి.మీటర్ల మేర ప్రజలు మానవహారంగా నిలబడ్డారు. నార్త్ కేరళలోని కసర్ గోడ్ నుంచి ప్రారంభమైంది. దక్షిణభాగంలోని కలియక్కవిలై వరకు దీనిని నిర్వహించారు. సీనియర్ సీపీఎం నాయకుడు ఎస్ రామచంద్రన్ కాసర గోడ్ వద్ద మొదటగా నిలబడగా..కలియక్క విలైలో ఏంఏ బేబీ చివరగా నిలబడ్డారు. సాయంత్రం 4గంటలకు మానవహారం ఏర్పాటైంది. అనంతరం రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. 

సీఏఏ చట్టాన్ని వ్యతిరేకించడంలో కేరళ సీఎం పినరయి విజయన్ ముందు వరుసలో నిలిచారు. సీపఐ లీడర్ రాజేంద్రన్ కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ..మానవ గొలుసు గొప్ప గోడగా ఏర్పడిందని, చట్టానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బలమైన గోడగా అభివర్ణించారు. సీఏఏ సెక్యూలరిజానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని, దీనిని తమ రాష్ట్రంలో అడుగు పెట్టనీవబోమని, అమలు జరగనివ్వబోమని తేల్చిచెప్పారు. 

 

* గత సంవత్సరం డిసెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానం పాస్ చేసింది. సీఏఏపై మొదటి రాష్ట్రం కేరళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
* ఎల్‌డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడీఎఫ్) ప్రతిపక్షాలు ప్రత్యేక సమావేశంలో తీర్మానం ఆమోదించడానికి ఒకే చెప్పాయి. 
* పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించేందుకు కలిసి రావాలని 11 మంది ముఖ్యమంత్రులకు సీఎం పినరయి విజయన్ లేఖలు రాశారు. 

 

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ప్రకంపనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు.. అనుకూలంగా బీజేపీ పోటాపోటీ ప్రదర్శనలు చేపడుతున్నాయి. సీఏఏ చట్ట వ్యతిరేకం అని, రాజ్యాంగ విరుద్ధం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశ పౌరుల హక్కులను కాలరాస్తుందని, మత ప్రాతిపదికన ప్రజలను విడగొట్టే ప్రయత్నం జరుగుతోందని అంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాయి. కేరళ, రాజస్థాన్, పంజాబ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు సీఏఏని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Read More : కోతుల బెడద అంట : ఏపీ భవన్‌లో I Love Amaravathi బోర్డు తొలగింపు