ట్వీట్ కలకలం.. రైతులకు సెలబ్రిటీల సపోర్ట్ నిజం కాదా..? గ్రెటా కుట్రను బయటపెట్టిందా?

నూతన వ్యవసాయచట్టాలు కేంద్రానికి కాక పుట్టిస్తున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని నెలలుగా నిరవధిక నిరసనోద్యమం చేస్తున్న రైతుసంఘాలు.. అక్టోబర్‌ వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని స్పష్టం చేసేసరికి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది ఈ ఉద్యమం. నూతన వ్యవసాయ చట్టాలు అంతర్జాతీయ చర్చకు దారితీయగా.. రైతు ఉద్యమానికి మద్దతుగా విదేశీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని కేంద్రం హితవు పలకగా.. కేంద్రం వ్యాఖ్యలను సమర్థిస్తూ పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ట్వీట్లు చేశారు. మరోవైపు ట్విట్టర్‌కు కేంద్రం నోటీసులు ఇవ్వగా.. చర్యలు తప్పవని హెచ్చరించింది కూడా.. రైతుల ఉద్యమానికి మద్దతుగా అంతర్జాతీయ సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తుండగా.. ఈ క్రమంలోనే రైతు నిరసనలు జరుగుతున్న ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేయడాన్ని ఖండిస్తూ ఇంటర్నేషనల్‌ పాప్‌ స్టార్‌ రిహన్నా ట్వీట్ చేయడం కలకలం సృష్టించింది.

ఈ ఒక్క ట్వీట్‌తో రిహన్నాకు 10 లక్షల మంది ఫాలోయర్స్‌ పెరిగారు. ఢిల్లీలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడం, రైతులపై దాడులకు పాల్పడటాన్ని అందరం ఖండించాలంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌ మేనకోడలు మీనా హ్యారిస్‌ కూడా ట్వీట్ చేశారు. మరోవైపు ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ కూడా రైతులకు అండగా నిలబడ్డారు. అన్నదాత ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ట్వీట్ చేశారు.

అయితే రైతుల ఉద్యమం బాగా ఆలోచించి వ్యూహంతో ప్రారంభించబడిందని, జనవరి 26 నాటి అల్లర్లు కూడా ఈ వ్యూహంలో భాగమేనని ఓ డాక్యుమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నాం’ అని గ్రెటా ట్వీట్‌ వేయగా.. ఆ తర్వాత గూగుల్ డాక్యుమెంట్ ఫైల్‌ను షేర్ చేస్తూ మరొక ట్వీట్ చేశారు. ఈ ఫైల్‌లో, భారతదేశంలో కొనసాగుతున్న రైతు ఉద్యమానికి ఆజ్యం పోసిన సోషల్ మీడియా ప్రచారం షెడ్యూల్ మరియు వ్యూహాలు అందులో ఉన్నాయి.

గ్రెటా ఈ ‘టూల్‌కిట్’ సహాయం చేయాలనుకునేవారి కోసం అని రాశారు. ఈ లింక్ భారత ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చే కార్యాచరణ ప్రణాళికను వివరిస్తుంది. గ్రెటా తర్వాత ఈ పబ్లిక్ ట్వీట్‌ను తొలగించారు, కానీ అప్పటికే ప్రజలు ఆ నోట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వివిధ ప్రముఖులు, గ్రూపులు మరియు ప్రజలు చేస్తున్న ట్వీట్లన్నీ ఈ టూల్‌కిట్‌లో ఉన్నాయి. రిహన్న చేసిన ట్వీట్ కూడా ఇందులో ఉంది.