Gst On Covid Vaccines Should Be Removed Till The End Of The Crisis
GST on Covid Vaccines : కొవిడ్ వ్యాక్సిన్లపై జీఎస్టీ తొలగించాలంటూ పెద్దఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయాల్లో జీఎస్టీ తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. అదేగాని జరిగితే కొవిడ్ వ్యాక్సిన్ల ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జీఎస్టీ కౌన్సిల్ త్వరలో సమావేశం కానుంది.
నివేదికల ప్రకారం.. కొవిడ్ వ్యాక్సిన్లపై జీఎస్టీని తొలగించడంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. కరోనా సంక్షోభం ముగిసేంతవరకూ వ్యాక్సిన్లపై పన్ను ఎత్తివేయాలంటూ ప్రతిపాదనలు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్లపై జీఎస్టీని ఆలస్యం చేయకుండా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లపై పన్నులను తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. వ్యాక్సిన్లపై పన్నులతో పాటు కొవిడ్ చికిత్సలో వాడే ఇతర ఔషధాలు, వైద్య పరికరాలపై పన్నులను తగ్గించాలని భావిస్తోంది. కొవిడ్ టీకాపై ప్రస్తుతం ఉన్న పన్నులు తగ్గించే అంశంపై ఈనెల 28న జీఎస్‌టీ మండలి చర్చించనుంది.
టీకాలతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్, మెడికల్ గ్రేడ్ పరికరాలు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ పై పన్ను తగ్గింపు ప్రతిపాదనలపై జీఎస్టీ మండలి పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ సమయంలో ప్రైవేటు రంగంలో కూడా వ్యాక్సినేషన్‌కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దేశంలో ప్రస్తుత కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్-V వ్యాక్సిన్‌ల ధరలను కంపెనీలు ప్రకటించాయి. అన్ని కంపెనీల వ్యాక్సిన్ల ధరలు ఒక డోసు రూ,1000 రూపాయలకు పైనే.. జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తే వ్యాక్సిన్ల ధర తగ్గే అవకాశం ఉందంటున్నారు.