రూ.4 లక్షలు ఖర్చుచేసి, కారుకి గ్రాండ్‌గా అంత్యక్రియలు చేసిన కుటుంబం.. ఎందుకంటే?

పదర్‌షింగా గ్రామంలో నివసించే సంజయ్‌ పోలారా కుటుంబం 12 ఏళ్ల క్రితం వ్యాగన్ ఆర్ కారును కొన్నది.

మనుషులకు, మూగ జీవాలకు అంత్యక్రియలు చేసే తంతు చూస్తుంటాం. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఓ కుటుంబం కారుకి అంత్యక్రియలు చేసి అందరి దృష్టినీ తమ వైపునకు తిప్పుకుంది. ఈ అంత్యక్రియలకు దాదాపు 1,500 మంది తరలిరావడం గమనార్హం. ఈ అంత్యక్రియలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

పదర్‌షింగా గ్రామంలో నివసించే సంజయ్‌ పోలారా కుటుంబం 12 ఏళ్ల క్రితం వ్యాగన్ ఆర్ కారును కొన్నది. దాన్ని కొన్నాక తమ జీవితాల్లో అదృష్టం కలిసొచ్చిందని వారు భావిస్తున్నారు. కారు పాతబడి పోవడంతో దానికి కృతజ్ఞతగా గురువారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

అందుకోసం రూ.4 లక్షలు ఖర్చు పెట్టారు. భవిష్యత్ తరాలకు ఈ విషయం గుర్తుండాలని భావించి కారును ఖననం చేసినట్లు ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ కుటుంబం తమ పొలంలోనే హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించింది. కారును పుష్పాలతో అలంకరించి, వారి ఇంటి నుంచి పొలం వరకు అంతియ యాత్రను నిర్వహించారు.

మంత్రోచ్ఛారణల మధ్య ఆ కారును 15 అడుగుల గోతిలో ఖననం చేశారు. సంజయ్ పొలారా మీడియాతో మాట్లాడుతూ.. ఆ కారు తమకు సంపద తీసుకొచ్చిందని అన్నారు. ఆ కారు కారణంగా తమకు వ్యాపారంలో విజయం లభించిందని తెలిపారు. ఆ కారు పాతబడి పోవడంతో దాన్ని ఇతరులకు అమ్మడం కంటే దానికి సమాధిని నిర్మించి నివాళులు అర్పించాలని భావించి ఈ పని చేసినట్లు చెప్పారు.

Drunk Driving Cases: హైదరాబాద్‌లో తీరు మార్చుకోని మందుబాబులు.. పలు చోట్ల డ్రంకెన్‌ డ్రైవ్ కేసులు