ఆమె అడవికి రాణి..చిరుతలు, సింహాలు,పైథాన్ లు ఆమె ఒడిలో చిన్నారులే

  • Publish Date - August 11, 2020 / 03:40 PM IST

అటవీశాఖలో అధికారి హోదాలో పనిచేయటమంటే ఏదో ఆఫీసులో కూర్చుని పనిచేయటం కాదు..అటవీజంతువుల పట్ల అవగాహనం ఉండాలి..వాటిని ఎలా సంరక్షించాలో వాటి భద్రత కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. అటువంటి అటవీశాఖలో జంతువుల‌ను సంర‌క్షించే బాధ్య‌తలు చేప‌ట్టిన‌ మొదటి మహిళగా పేరొందారు రసిలా వాధోర్‌…



అడవిలో డ్యూటీ చేయటమంటే ఆ అడవిమీద అవగాహన ఉండాలి. పట్టు ఉండాలి. దానికి మించిన ధైర్యం..అంకిత భావం ఉండాలి. అటువంటి ఆఫీసర్ రసిలా వాథోర్. రసిలా వాథోర్ కు శక్తి సామర్థ్యాలను..డ్యూటీలో ఆమె కమిట్ మెంట్ కు గురించి ప్రముఖ ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ప్రశంసించారు. రసిలా వాథోర్ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు పర్వీన్ కస్వాన్. ఈ ఫొటో కింద ఆయ‌న రసిలా గురించి..ఆమె సేవల గురించి రాస్తూ.. రసిలా వాధోర్‌… గిర్‌లో ఫారెస్టర్. ఇప్పటివరకు ఆమె 1000కి పైగా జంతువులను రక్షించారు. 300 సింహాలు, 500 చిరుతపులులు, మొసళ్ళు, కొండ‌చిలువల‌ను రక్షించారు. ఆమె అడవికి రాజు… అంత‌కంటే ఎక్కువ బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని పేర్కొన్నారు.



అటవీశాఖలో జంతువుల‌ను సంర‌క్షించే బాధ్య‌తలు చేప‌ట్టిన‌ మొదటి మహిళగా పేరొందిన ర‌సిలా గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్ లో పనిచేస్తున్నారు. 2007లో గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్న‌స‌మ‌యంలో రాష్ట్రంలో అటవీశాఖలో మ‌హిళ‌ల నియామ‌కం జ‌రిగింది. అలా ఆ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన రసిలా 2008లో అట‌వీశాఖ‌లో చేరారు. ఉద్యోగాన్ని కేవలం డ్యూటీగానే కాకుండా అడవి తన సొంత ఇల్లు అన్నట్లుగా తన స్వంత ఇంటిలో బిడ్డలకు ఏమన్నా కష్టమొస్తే ఎంత జాగ్రత్తగా..బాధ్యతగా చూసుకుంటారో అలాగే అడవిలోనే జంతువులను కూడా చూసుకుంటారామె.



గాయ‌ప‌డిన అట‌వీ జంతువుల వద్దకు వెళ్లి, వాటికి స‌ప‌ర్య‌లు చేసి..అవి కోలుకునే వరకూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. వాటికి కొత్త జీవితాన్ని అందిస్తారు. అలా ఆమె 1000కి పైగా జంతువులను రక్షించారు. 300 సింహాలు, 500 చిరుతపులులు, మొసళ్ళు, కొండ‌చిలువల‌ను రక్షించారు.
ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ త‌న‌కు వృత్తి విష‌యంలో పని గంటలు పూర్తి చేసుకుని డ్యూటీ దిగిపోవటం ఇష్టం ఉండదనీ.. జంతువుల‌ను ఏ స‌మ‌యంలోనైనా రక్షించాల్సి ఉంటుందని…అందుకే నాకు ఈ అడవే నా ప్రపంచం అంటారు. రసిలా కమిట్ మెంట్ చూసి తోటి ఉద్యోగులు ఆశ్చర్యపోతారు. ఆమెకు ఎంత ఓర్పు..ఎంత కమిట్ మెంట్ అనుకుంటుంటారు. ఈ వృత్తిలో ఎన్ని స‌మ‌స్య‌లు ఎదువుతున్నా, ఆమె బాధ్య‌తాయుతంగా ప‌నిచేస్తుంటార‌ని ఆమెను అభినందిస్తుంటారు.