పాటీదార్ ఉద్యమనేత, గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త హార్దిక్ పటేల్‌ను ఎందుకు కొట్టాల్సి వచ్చిందో వివరణనిచ్చాడు తరుణ్ గజ్జర్. ఏప్రిల్ 19వ తేదీ గుజరాత్ రాష్ట్రం సురేంద్రనగర్‌లో జన్ ఆక్రోశ్ సభలో మాట్లాడుతుండగా పటేల్‌పై తరుణ్ గజ్జర్ దాడి చేశాడు. చెంప చెల్లుమనిపించాడు. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం అలర్ట్ అయిన పార్టీ కార్యకర్తలకు తరుణ్ గజ్జర్‌ని చితకబాదారు. ప్రస్తుతం ఇతను ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తాను ఎందుకు కొట్టాల్సి వచ్చిందో మీడియాకు వివరించాడు తరుణ్. హార్దిక్ పటేల్ వల్ల ఇబ్బందులు పడినట్లు వెల్లడించాడు. ఎప్పుడు పడితే అప్పుడు గుజరాత్ బంద్ చేస్తారు..రోడ్లు మూసివేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య గర్భవతిగా ఉన్న సమయంలో పటీదార్ ఉద్యమం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అహ్మదాబాద్ సందర్భంగా కుమారుడి మందుల కోసం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని వాపోయాడు. హార్ధిక్ పటేల్ గుజరాత్ హిట్లర్ అంటూ అభివర్ణించాడు.
దాడి అనంతరం పోలీసులకు కంప్లయింట్ చేశాడు హార్ధిక్ పటేల్. తనను భయపెట్టడానికి బీజేపీ ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపించారు. ఎంతోకాలంగా పాటీదార్ ఉద్యమనేతగా ఉన్న హార్ధిక్.. ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ లీడర్ జీవీఎల్ పై దాడి జరిగిన ఒక్క రోజు తర్వాతే ఈ ఘటన జరగటం కలకలం రేపుతోంది. మిగతా నేతలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.