Haryana Elections 2024: హర్యానాలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. బరిలో ప్రముఖులు వీరే..

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పంకజ్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలో మొత్తం 2,03,54,350 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 8,821 మంది ఓటర్లు 100 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.

Haryana Elections 2024

Haryana Elections 2024: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఒకే రోజు పోలింగ్ జరుగుతుంది. శనివారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడి కానున్నాయి. చిన్న రాష్ట్రమే అయినప్పటికీ దేశ రాజకీయాల్లో హర్యానా కీలక పాత్ర పోషిస్తుంటుంది. పదేళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ.. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, పదేళ్ల కాలంలో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఆ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఈసారి హర్యానాలో మాదే అధికారమన్న ధీమా వ్యక్తమవుతోంది.

Also Read : హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఏ పార్టీకి మద్దతిచ్చారో తెలుసా?

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పంకజ్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలో మొత్తం 2,03,54,350 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 8,821 మంది ఓటర్లు 100 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు మొత్తం 20,632 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 90 నియోజకవర్గాల్లో 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 101 మంది మహిళా అభ్యర్థులు కాగా.. మిగిలిన వారు పురుష అభ్యర్థులు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. 30వేల మందికిపైగా పోలీసులు, 225 కంపెనీల పారా మిలటరీ బలగాలను భద్రతకు మోహరించారు.

 

బరిలో ప్రముఖులు.. నియోజకవర్గం..
ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ (లద్వా), ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు భూపేంద్ర సింగ్ హుడా (గర్హి సంప్లా-కిలోయ్), ఐఎన్ఎల్డీ అభయ్ సింగ్ చౌతాలా (ఎల్లినాబాద్), జేజేపీకి చెందిన దుష్యంత్ చౌతాలా (ఉచన కలాన్), బీజేపీకి చెందిన అనిల్ విజ్ (అంబాలా కంటోన్మెంట్), కెప్టెన్ అభిమన్యు (నార్నాండ్), ఓపీ ధంఖర్ (బద్లీ), ఆమ్ ఆద్మీ పార్టీకి నుంచి అనురాగ్ ధండా (కలయత్), కాంగ్రెస్ నుంచి విఘ్నేశ్ ఫొగట్ (జులానా), తోషమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ మాజీ ఎంపీ శృతి చౌదరి, కాంగ్రెస్ పార్టీ నుంచి అనిరుధ్ చౌదరి పోటీ చేస్తున్నారు. దేవిలాల్ మనవడు, ఐఎన్ఎల్డీ అభ్యర్ధి అధిత్య దేవిలాల్ దబ్వాలి నియోజకవర్గం నుంచి పోటీలో ఉండగా.. జేజేపీ నుంచి మాజీ ఉపప్రధాని ముని మనవడు దిగ్విజయ్ సింగ్ చౌతాలా పోటీ చేస్తున్నారు. హిసార్ లోని అడంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ ను బీజేపీ బరిలోకి దింపగా.. మహేంద్రగఢ్ లోని అటెలి నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న ఆర్తీరావును పోటీకి దింపింది.