కాలానికి, వాతావరణానికి అస్సలు మ్యాచ్‌ కావట్లేదేంటి? గతంలో ఎన్నడూలేని విధంగా ఇప్పుడు ఈ పరిస్థితి..

ఒకే సమయంలో ఓ చోట కరవు ఉంటే.. మరోచోట వరదలు ముంచేస్తున్నాయి. వర్షానికి, వర్షానికి మధ్య విరామం..

Weather Update

సీజన్ల వారీగా వాతావరణంలో మార్పులు వస్తుంటాయి.. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో వెదర్‌ ఉండాలి. కానీ, ఇప్పుడు కాలానికి వాతావరణానికి అస్సలు మ్యాచ్‌ కావడం లేదు. కాలం ఏదైనా అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టి.. ఒక వైపు వరదలు.. మరోవైపు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు. టోటల్‌గా అసాధారణ వాతావరణం ప్రపంచానికి శాపంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అతివర్షాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై మళ్లీ చర్చ మొదలైంది.

కాలం మారుతోందా..? కాల గమనాన్నే మార్చేస్తోందా? ఎండాకాలంలో వానలు… వానాకాలంలో ఎండలు… ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లు అసాధారణ వర్షాలు.. వాన వెలిసిన వెంటనే మాడు పగిలేలా ఎండలు… అసలు ఏమైందీ కాలానికి…? వానతో వచ్చిన చల్లదనం ఒక్కసారిగా మారిపోడానికి కారణమేంటి? ఎండాకాలంలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు… వానాకాలంలో భారీ వర్షాలు… గతంలో ఎన్నడూ లేనట్లు గత మూడు నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి.

ఏడాది పాటు సరిపోయే వర్షం మొత్తం ఒకేరోజు
సాధారణ వర్షాలు అన్న మాటే మరచిపోయేలా తయారైంది వాతావరణం. వాన పడిందంటే అప్పటివరకు ఉన్న రికార్డులు అన్నీ చెరిగిపోతున్నాయి. ఏడాది పాటు సరిపోయే వర్షం మొత్తం ఒకేరోజు కురుస్తోంది. ఇలాంటి అరుదైన పరిస్థితులు గత కొన్నేళ్లుగా రొటీన్‌గా మారిపోయాయి. తాజాగా విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వాన… 50 ఏళ్ల రికార్డును చెరిపేసింది. ఇదే సమయంలో ఉత్తర, పశ్చిమ భారతదేశాన్ని వరదలు అతాలాకుతలం చేస్తున్నాయి.

కాలాలకు అనుగుణంగా వాతావరణంలో వేడి పెరగడం సాధారణ ప్రక్రియే. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో… ఇప్పుడు జూన్‌లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు వర్షాకాలంలో చల్లబడాలి.. సాధారణం కంటే వర్షాలు తక్కువగా కురిసినప్పుడు కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి. కానీ, ఇప్పుడు అసాధారణ వర్షాలు కురిసినా వాతావరణంలో చల్లదనం కనిపించడం లేదు. ఉక్కపోత ఎక్కువగానే ఉంటోంది.

ఊహించని విధంగా ఉష్ణోగ్రతలు
దేశంలో పలుచోట్ల ఇలాంటి పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం… దీనికి అనేక మార్పులు కారణమని చెబుతున్నారు మన శాస్త్రవేత్తలు. సాధారణంగా ప్రతి పది సంవత్సారాలకు ఓ సారి వాతావరణ మార్పులు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో వాతావరణంలో ఇలాంటి హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ, ఇప్పుడు ప్రతి రెండు – మూడేళ్లకు కాల గమనంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా ఉష్ణోగ్రతలు, వర్షాలు నమోదవుతున్నాయి.

ఉపరితల వేడి కారణంగా ఏర్పడిన ఎల్‌ నినో ప్రభావంతో మన దేశంలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రుతుపవనాలు అస్తవ్యస్తంగా మారి గందరగోళం నెలకొంది. ఇటు భూమిపైన, అటు సముద్రంపైన వేడి పెరుగుతుండటం వల్ల అతివృష్టి. అనావృష్టి సంభవిస్తోందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ కారణంగానే దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకే సమయంలో ఓ చోట కరవు ఉంటే.. మరోచోట వరదలు ముంచేస్తున్నాయి. వర్షానికి, వర్షానికి మధ్య విరామం ఎక్కువగా ఉంటోంది. భారీ వర్షాలు ఒకవైపు, వర్షమే లేని ప్రాంతాలు మరోవైపు ఉంటున్నట్లు చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

Also Read: కృష్ణా నదికి పెరుగుతున్న వరద ఉధృతి.. భయాందోళనలో లంక గ్రామాల ప్రజలు

ట్రెండింగ్ వార్తలు