Amar Jawan Jyoti : అమర జవాన్ జ్యోతిని వార్ మెమోరియల్ జ్వాలలో ఎందుకు కలిపారు..? హిస్టరీ ఏంటి..?

ఈ కారణంగానే యుద్ధ స్మారకం దగ్గర అమర జవాన్ జ్యోతి వెలిగితేనే వారికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని మోడీ ప్రభుత్వం భావించింది.

Amar Jawan Jyothi : ఢిల్లీలోని అమర జవాన్ జ్యోతిని.. జాతీయ యుద్ధ స్మారకం దగ్గరున్న జ్వాలలో విలీనం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇండియా గేట్ దగ్గర 50 ఏళ్లుగా బ్రేక్ లేకుండా వెలిగిన అమర జవాన్ జ్యోతి.. 2022 జనవరి 21, శుక్రవారం రోజుతో కనుమరుగైంది. ఆ జ్యోతిలోని కొంత భాగాన్ని టార్చ్ లా తీసుకెళ్లి.. నేషనల్ వార్ మెమోరియల్‌లో విలీనం చేశారు. అమర జవాన్ జ్యోతి వెలిగే ప్రాంతానికి 400 మీటర్ల దూరంలో ఉన్న నేషనల్ వార్ మెమోరియల్ అగ్ని జ్వాలలో కలిపారు. ఎయిర్ మార్షల్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అధిపతి బలభద్ర రాధాకృష్ణ ఈ జ్వాలను స్వీయ హస్తాలతో విలీనం చేశారు.

Read This : WhatsApp : వాట్సాప్‌ వాడొద్దు, జూమ్‌తో జాగ్రత్త.. కేంద్రం కొత్త గైడ్‌లైన్స్

మొదటి ప్రపంచ యుద్ధం, మూడో ఆంగ్లో-అఫ్ఘాన్ యుద్ధంలో మరణించిన భారత సైనికుల స్మారకార్థం.. ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం ఇండియా గేట్‌ నిర్మించింది. ఆ తర్వాత.. బంగ్లాదేశ్ విమోచనం కోసం భారత్-పాకిస్థాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో అమరులైన సైనికుల స్మారకార్థం.. అప్పటి కేంద్ర ప్రభుత్వం అమర జవాన్ స్మారకం నిర్మించారు. 1972 జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అమర్‌ జవాన్‌ జ్యోతిని వెలిగించారు. అప్పటి నుంచి వెలుగుతూనే ఉంది ఈ జ్యోతి. రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం లాంటి వేడుకల సందర్భంగా ఈ జ్యోతి దగ్గర అమర వీరులకు నివాళులర్పిస్తుంటారు. అలా.. 50 ఏళ్ల పాటు వెలుగుతూ వచ్చిన అమర జవాన్ జ్యోతి ఇపుడు విలీనమైంది.

Read This : సబ్బు, సర్ఫ్ లేనప్పుడు బట్టలు ఎలా ఉతికేవారు?

1947 నుంచి భారతదేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల జ్ఞాపకార్థం.. 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఇండియా గేట్ సమీపంలో 40 ఎకరాల్లో నేషనల్ వార్ మెమోరియల్‌ను నిర్మించింది. 2019 ఫిబ్రవరి 25న మోదీ దీనిని ఆవిష్కరించారు. ఈ ప్రాంగణంలో.. దాదాపు 26 వేల మంది అమర జవాన్ల పేర్లను సువర్ణాక్షరాలతో గ్రానైట్ శిలాఫలకాలపై చెక్కించారు. అమర జవాన్ల జ్యోతి దగ్గర సైనికుల పేర్లు లేవనీ.. ఈ కారణంగానే యుద్ధ స్మారకం దగ్గర అమర జవాన్ జ్యోతి వెలిగితేనే వారికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని మోడీ ప్రభుత్వం భావించింది. ఒకే కారణంతో రెండు జ్యోతుల నిర్వహణ కష్టమనే అభిప్రాయం కూడా కేంద్రం వినిపించింది. అయితే.. అమర జవాన్ జ్యోతి విలీనంపై.. ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ సహా.. కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కొందరు.. దేశభక్తి, వీరుల త్యాగాన్ని అర్థం చేసుకోలేరన్నారు. మన సైనికుల కోసం.. అమర జవాన్ జ్యోతిని.. మళ్లీ వెలిగిస్తామని.. రాహుల్ ట్వీట్ చేశారు. ఐతే.. జ్యోతిని ఆర్పలేదని.. కాగడాతో తరలించి విలీనం చేశామని కేంద్రం వివరణ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు