ప్రణబ్‌ ముఖర్జీ సీక్రెట్స్‌, డైరీలోని విషయాలు వెల్లడవుతాయా

  • Publish Date - September 1, 2020 / 01:16 PM IST

కాంగ్రెస్‌లో నెహ్రూ వారసులకు దీటుగా నిలబడి మనగలిగిన నేతలు అతి కొద్దిమంది. ఆ జాబితాలోని ముందంచెలో ఉంటారు ప్రణబ్ ముఖర్జీ. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కాదు దేశ రాజకీయాలోనే ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకపక్క తనదైన ముద్రని నిలబెట్టుకుంటూనే… ఇందిర నుంచి సోనియా వరకూ పార్టీ అగ్ర నాయకత్వానికి విధేయుడిగా కూడా పేరు పొందారు.



దేశ రాజకీయాల్లో కీలక పాత్ర : 
అత్యంత సుదీర్ఘకాలం దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ప్రణబ్‌… తన రాజకీయానుభవం గురించి రెండు పుస్తకాలు రాశారు. ది డ్రమటిక్‌ డికేడ్‌.. ది ఇందిరాగాంధీ ఇయర్స్‌ అనే పుస్తకంలో ఎమర్జన్సీ గురించి ప్రణబ్‌ ఆశ్చర్యకరమైన నిజాలు ఎన్నో వెల్లడిస్తారని అంతా ఊహించారు. కానీ ఈ పుస్తకం సాదాగా సాగిపోయింది. ప్రణబ్‌ తన మనసులో ఎన్నో రహస్యాలను దాచుకునే ఉన్నారని పాఠకులు అప్పుడే ఊహించారు.

ప్రణబ్ రెండో పుస్తకం : 
ఆ తర్వాత చాలా ఏళ్లకు ప్రణబ్‌ తన రెండో పుస్తకమైన ది టర్బులెంట్‌ ఇయర్స్‌ అనే పుస్తకాన్ని రాశారు. అయితే ఇందులో కూడా ప్రణబ్‌ ఆచితూచి తన పదాలను ప్రయోగించినట్లు కనిపించింది. ఇందిరాగాంధీ మరణం తరువాత ప్రణబ్‌ ముఖర్జీ ప్రధానమంత్రి పదవిని ఆశించారని చెబుతారు. అయితే తనకు అలాంటి ఆశ ఏమీ లేదని ఈ పుస్తకంలో తేల్చి చెప్పారు ప్రణబ్‌. అయితే మరి రాజీవ్‌గాంధీ నుంచి దూరమై, పార్టీని సైతం వీడి వేరు కుంపటి ఎందుకు పెట్టుకున్నారన్న దానికి స్పష్టమైన జవాబులు కరువయ్యాయి.



పీవీ దోషి : 
ఇతర సంప్రదాయ కాంగ్రెస్‌ నేతలలాగానే బాబ్రీమసీదు విధ్వంసానికి తెలుగువాడైన పీవీ నరసింహారావును తన పుస్తకంలో దోషిగా తేల్చారు ప్రణబ్‌. నిజానికి 1980-1996 మధ్య కాలంలో దేశంలో చాలా ఉపద్రవాలే సంభవించాయి. 1984లో ఇందిరాగాంధీ హత్య తరువాత దేశవ్యాప్తంగా దాదాపు 3వేల మంది సిక్కుల్ని ఊచకోత కోశారు. ఒక్క ఢిల్లీలోనే రెండు వేల మందికి పైగా సిక్కులు మృత్యువాత పడ్డారు. కాంగ్రెస్‌ను ఏళ్లపాటు వెంటాడిన బోఫోర్సు కుంభకోణానికి అంకురార్పణ జరిగింది కూడా ఆ సమయంలోనే.
https://10tv.in/tollywood-shootings-in-september/
ఉన్నత పదవులు : 
ది టర్బులెంట్‌ ఇయర్స్‌ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ప్రణబ్‌ కొన్ని రహస్యాలు తనతోనే సమాధి అయిపోతాయని చెప్పారు. తనకి రోజూ డైరీ రాసే అలవాటు ఉందనీ, భవిష్యత్ లో వచ్చే ప్రభుత్వాలు కావాలనుకుంటే వాటిని ప్రజలకు వెల్లడించవచ్చనీ చెప్పారు. రక్షణ మంత్రిగా, ఆర్థికశాఖ మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా… కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రణబ్‌ వివిధ ఉన్నత పదవుల్ని అలంకరించారు.



కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు : 
అన్నింటికీ మించి కాంగ్రెస్‌ పార్టీకీ, అందులోని నాయకత్వానికీ వీరవిధేయుడిగా పేరుగాంచారు. మరి ఎమర్జెన్సీ, బోఫార్సు, సిక్కుల అల్లర్లు, శ్రీలంకలో భారతేదేశపు జోక్యం… ఇలా చాలా విషయాలకు సాక్షిగా ఉన్న వ్యక్తి మనసులో రహస్యాలకు కొదవేముంటుంది. ప్రణబ్‌ ఆశించినట్లు… ఆయన డైరీలోని విషయాలను ప్రభుత్వాలు బయటకు వెల్లడిస్తాయో, లేదో చూడాలి.