×
Ad

Soldiers Woman Wedding : సెల్యూట్ సోల్జర్స్.. హిమాచల్ ప్రదేశ్‌లో మహేశ్ బాబు సినిమా తరహా ఘటన.. వీడియో వైరల్.. నెటిజన్లు ప్రశంసలు..

Soldiers Fulfil Role Of Brother At Woman Wedding: 2024లో అరుణాచల్ ప్రదేశ్‌లో దేశంకోసం సైనికుడు ఆశీష్ కుమార్ ప్రాణాలు అర్పించాడు. అయితే..

Soldiers Fulfil Role Of Brother At Woman Wedding

Soldiers Fulfil Role Of Brother At Woman Wedding: తెలుగులో హీరో మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా తరహా ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సినిమాలో హీరో మహేశ్ బాబు.. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన జవాన్ ఇంటికి వెళ్తాడు. అక్కడ వారి కుటుంబంలో సభ్యుడిగా వారి సమస్యలను తీర్చి.. సైనికుడి చెల్లి పెండ్లిని దగ్గరుండి జరిపిస్తాడు. అన్నలేని లోటును తీరుస్తాడు. అదే తరహాలో హిమాచల్ ప్రదేశ్ సర్మూర్ జిల్లా భార్లీ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటన అందరి గుండెల్ని కదిలించింది.

2024 ఫిబ్రవరిలో అరుణాచల్ ప్రదేశ్‌లో దేశంకోసం సైనికుడు ఆశీష్ కుమార్ ప్రాణాలు అర్పించాడు. అయితే, అతని సోదరి అరాధన వివాహం తాజాగా జరిగింది. అరాధన పెండ్లిని ఆశీష్ కుమార్ సహచర సైనికులు దగ్గరుండి జరిపించారు. అరాధనను పెండ్లి మండపానికి సైనికులు గౌరవంగా తీసుకెళ్లారు. 19 గ్రెనాడియర్ బెటాలియన్‌కు చెందిన సైనికులు తమ యూనిఫాంలో ఈ బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు.. ఆమెకు ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో బహుమతి కూడా ఇచ్చారు. తద్వారా ఆమె జీవితంలో తన అన్న ఆశీష్ లేనిలోటును కొంతైనా తీర్చే ప్రయత్నంను సైనికులు చేశారు. అయితే, ఈ వివాహానికి పొయంటా, షిల్లై ప్రాంతాల నుంచి మాజీ సైనికులు కూడా హాజరయ్యారు.

అరాధన, వారి కుటుంబ సభ్యులకు ఆశీష్ లేని లేటును సైనికులు దగ్గరుండి తీర్చారు. సైనికులు తమ ప్రేమ, ఆదరణతో దగ్గరుండి అరాధనను తన సొంత సోదరిగా భావించి పెండ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. పెండ్లికి వచ్చిన అతిథులు, కుటుంబ సభ్యులు ఈ దృశ్యం చూసి కన్నీరు ఆపుకోలేక పోయారు. సైనికుల సోదర ప్రేమకు ఇది నింజగా గొప్ప ఉదాహరణ అని వారంతా చర్చించుకున్నారు.

అరాధనను పెండ్లి మండపానికి ఆర్మీ దుస్తుల్లో ఉన్న సైనికులు గౌరవంగా తీసుకొస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సైనికులు చేసిన పనిపట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ రకమైన చర్యలు సైనికుల మానవత్వ గుణాన్ని, దేశ భక్తిని మరింత మెరుగుపరుస్తాయని నెటిజన్లు పోస్టులు పెట్టారు. మరికొందరు సైనికుల చర్యను గొప్పగా వర్ణిస్తూ పోస్టులు చేశారు.


Also Read: Upendra Dwivedi : పాకిస్తాన్‌కు భారత ఆర్మీ చీఫ్ మాస్ వార్నింగ్..