ఓకే గూగుల్ అని ఇంగ్లీషులో చెప్పగానే యాక్టివేట్ అయిపోయే గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు తెలుగు భాషలోనూ అందుబాటులోకి రానుంది. ఇంగ్లీషే కాకుండా ముఖ్యమైన భారత భాషల్లో మాట్లాడితే గుర్తు పట్టే విధంగా రూపొందించారు. ఇందులో భాగంగానే తెలుగులో కూడా పనిచేసేలా టెక్నాలజీని అభివృద్ధి చేయగలిగారు. తెలుగు, హిందీతో పాటు మరో 7భాషల్లో గూగుల్ అసిస్టెంట్ రెడీ అయింది.
మొబైల్ యూజర్ తాను గూగుల్ అసిస్టెంట్‌తో హిందీలో మాట్లాడాలనుకుంటే ‘ఓకే గూగుల్ హిందీ బోలో’ అని కానీ, ‘టాక్ టూ మీ ఇన్ హిందీ’ అని గానీ పలికితే సరిపోతుంది. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో స్పందించాలని అనుకుంటే టాక్ టూ మీ ఇన్ తెలుగు లేదా తెలుగులో మాట్లాడు అనాలి. అంటే సరిపోతుంది.
గూగుల్ అసిస్టెంట్‌ను స్థానిక ప్రజలకు సరిపడేలా ఆధునీకరించినట్లు గూగుల్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ మాన్యుల్ బ్రాన్ స్టీన్ ఒక ప్రకటనలో తెలిపారు.కొత్త భాషలు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఆండ్రాయిడ్ గో, కియో పరికారల్లో అందుబాటులోకి వస్తున్నాయని బ్రాన్ స్టీన్ చెప్పారు. ఒక భాషలోంచి ఇంకో భాషకు ట్రాన్స్‌లేట్ చేయగల గూగుల్ సేవలు త్వరలో అందుబాటులోకి వస్తాయని మాటిచ్చారు.