Amith Shaw
Amit Shah : జమ్మూ కాశ్మీర్‍లో హిందువులపై వరుసగా జరుగుతున్న ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కూడా కీలక భేటీ జరుగుతోంది. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో రెండోసారి జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశం లో జమ్మూకాశ్మీర్ లో కాశ్మీర్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై చర్చిస్తున్నారు.
కాశ్మీర్ లోని మైనార్టీ హిందువులపై ఉగ్రవాదులు ఇటీవలి కాలంలో దాడులు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కాశ్మీరీ మహిళా టీచర్ ను ఉగ్రవాదులు హత్య చేశారు. ఆ తర్వాత ఒక హిందూ బ్యాంకు ఉద్యోగిని కూడా ఉగ్రవాదులు హతమార్చారు. కాశ్మీర్ లోని హిందువులు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. ప్రభుత్వం తమను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారు కోరుతున్నారు. మే నెలలో మొత్తం 9 మంది హిందులను ఉగ్రవాదులు హత్య చేశారు.
భారీగా ఉగ్రవాదుల దాడులతో మళ్లీ కాశ్మీర్ లోయలోంచి కాశ్మీరీ పండిట్లు, హిందువులు వలస వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కాశ్మీర్ ప్రాంతంలో హిందువులే లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రదాడుల నేపధ్యంలో హోంమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్రం… దాడులకు గల కారణాలు… వాటిని ఎలా నివారించాలి… నిఘా సంస్థల నుంచి వస్తున్న సమాచారం… తీసుకోవాల్సిన చర్యలపై… ఈసమావేశంలో కీలకంగా చర్చించనున్నారు.
ఈ ఉన్నత స్థాయి భేటీకి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, జాతీయ భద్రతా సలహాదారు, ఆర్మీ చీఫ్, ఐబి చీఫ్, రా చీఫ్, సీఆర్పీఎఫ్, బిఎస్ఎఫ్, హోం మంత్రిత్వ శాఖకు చెందిన ముఖ్య అధికారులు హాజరయ్యారు.
Also Read : Hyderabad : హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల ముఠా గుట్టు రట్టు