దేశ హోంమంత్రికి తప్పని లాక్ డౌన్ కష్టాలు…వీడియో కాల్ లో తల్లి సంవత్సరీకం

దేశంలో ప్రస్తుతం నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితులకు అద్దం పట్టే ఓ ఘటన ఢిల్లీలో జరిగింది. లాక్ డౌన్ అంటే ఎక్కడివాళ్లు అక్కడే ఇళ్లకు పరిమితమవ్వాలి. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ప్రజలను బయటకు అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రజలంతా కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు తమ తమ ఇళ్లల్లోనే ఉంటున్నారు. అయితే అప్పటికి కొంతమంది నాయకులు కొన్నిచోట్ల లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘిస్తూనే ఉన్నారు.

అయితే కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ఇవాళ చేసిన పని దేశంలోని లాక్ డౌన్ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారి తల్లి చనిపోయి నేటికి ఏడాది పూర్తి అయింది. ఇవాళ తెలంగాణలోని తన స్వగ్రామంలో సంవత్సరీకం నిర్వహించాల్సి ఉంది. అయితే ఆయన ఢిల్లీలో ఉండిపోయారు.

లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేయకూడదని,తాను అలా చేస్తే మిగిలినవాళ్లు కూడా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తారన్న ఉద్దేశ్యంతో కిషన్ రెడ్డి తెలివిగా ఆలోచించారు. ఢిల్లీలోని తన నివాసంలోనే కిషన్ రెడ్డి సోమవారం (ఏప్రిల్-13,2020) సంప్రదాయ సంస్కారాలను నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వగ్రామం తిమ్మాపూర్ నుంచి కిషన్ రెడ్డి భార్య, పిల్లలు, సోదరులు, ఇతర బంధువులూ ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

గతేడాది సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు బీజేపీ నేత కిషన్ రెడ్డి తల్లి ఆండాళమ్మ (80) అనారోగ్యంతో కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019 ఏప్రిల్ 25న తుది శ్వాస విడిచారు. కిషన్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌.

మా అమ్మగారు శ్రీమతి ఆండాళమ్మ గారి మొదటి పుణ్యతిథి సందర్భంగా, ఢిల్లీ నివాసంలో శాస్త్రోక్తంగా శ్రాద్ధకర్మలు నిర్వహించాను.  కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆన్ లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.దేశానికి మరింత సేవచేసేందుకు, శక్తి,యుక్తులను ఇవ్వాలని, మా అమ్మ గారిని  ప్రార్ధించాను అంటూ ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన కరోనా కట్టడికి చేసే కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.