డయల్ 112 : తెలుగు రాష్ట్రాల్లో అత్యవసర సేవలన్నిటికి ఒక్కటే నంబర్

  • Publish Date - February 20, 2019 / 05:54 AM IST

దేశవ్యాప్తంగా అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన ఒకే ఒక టోల్ ఫ్రీ నంబరు 112 ను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సేవలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మంగళవారం (ఫిబ్రవరి 19, 2019)న ప్రారంభమయ్యాయి. పోలీసు, అగ్నిమాపక, ఆరోగ్యం, మహిళా హెల్ప్‌లైన్లు లాంటి అత్యవసర సేవలకు ఇప్పటి వరకు వేర్వేరు నంబర్లు ఉండేవి. వీటన్నింటినీ ఒక్కటి చేసి రూపొందించిన ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టమ్ (ERSS)‌ను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. 

వచ్చే ఏడాది నాటికి ఈ నెంబరు దేశమంతటా పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్‌లో ‘పవర్‌ బటన్‌’ను మూడు సార్లు వెంటవెంటనే నొక్కినా కూడా హెల్ప్‌లైన్‌కు సమాచారం అందుతుంది. సాధారణ ఫోన్లలో ‘5’ లేదా ‘9’ అంకెను లాంగ్‌ ప్రెస్‌ ద్వారా కూడా ఈ సేవలు పొందే అవకాశం ఉంది. 

దేశంలోని సేఫ్‌ సిటీ ప్రాజెక్టుల అమలుకు హైదరాబాద్‌ సహా 8 ప్రాంతాలను గుర్తించినట్లు హోం మంత్రి పేర్కొన్నారు. దీని కోసం నిర్భయ నిధుల పథకం కింద తొలి విడతగా రూ. 2,919 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర హోం శాఖ, మహిళ శిశు అభివృద్ధి సంయుక్తంగా ప్రారంభించాయి. ఇందు కోసం రూ.321.69 కోట్లు ఖర్చు చేశారు.