Dry Throat: నోటి దుర్వాసన, దగ్గు, పుండ్ల సమస్యలకు ఈ పానీయాలు చక్కటి పరిష్కారాలు

పొడి గొంతు సమస్యలకు, దగ్గు, నోటి దుర్వాసన వంటి సమస్యలకు పరిష్కారానికి ఈ చక్కటి పానీయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయంటున్నారు నిపుణులు. అంతేకాదు సీజనల్ వ్యాధులకు చక్కటి ప్రయోజనాలు..

Dry Throat Solution tips : అసలే వర్షాకాలం. సీజనల్ వ్యాధులు దాడి చేసే కాలం. మరి జాగ్రత్తగా ఉండకపోతే తప్పవు తిప్పలు. కాబట్టి ఇమ్యునిటీ పెంచుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉండాలి అంటే సీజన్ వ్యాధులు దాడి చేయకుండా ఉండాలంటే..ఇవిగో ఈ చక్కటి పానీయాలు సేవించండీ..ఇమ్యునిటీ లేకపోతే సీజనల్‌ వ్యాధులు మేమున్నా అంటూ దాడి చేస్తాయి.జలుబు, దగ్గు తప్పవు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, అలర్జీల వల్ల వచ్చే దగ్గు కుదురుగా ఉండనివ్వదు.

చికాకు తలనొప్పి కూడా వస్తాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ అండ్‌ క్రానియోఫేషియల్‌ రీసెర్చ్‌ నివేదికల ప్రకారం నోరు మంట, పెదాల పగుళ్ళు, గొంతులో గరగరా,దగ్గు, నోటి పుండ్లు, దుర్వాసన వంటివి పొడిగా ఉండే నోటి లక్షణాలు. చాలా మందికి ఉండే సమస్యలివి. కానీ ఇంటిలో చాలా ఈజీగా తయారు చేసుకునే రెమిడీలతో వీటినుంచి ఉపశమనం పొందవచ్చ అంటున్నారు నిపుణులు. మరి పానీయాలు ఏమిటో తెలుసుకుందాం..


తులసి, తేనెలతో టీ

ఆయుర్వేద శాస్త్రంలో తులసి, తేనెలకు అత్యంత ప్రత్యేక స్థానం ఉంది. ప్రకృతి అందించే సహజసిద్ధమైన తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటి ఫంగల్‌ కారకాలు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలను నివారించడంలో తోడ్పడతాయి. అలాగే తులసి. అత్యంత పవిత్రమైన మొక్క. అందరి ఇళ్లలోను ఉండే ఈ తులసి మొక్క ఔషధాల గని. ఇంటి వైద్యం, నాటు వైద్యాలలో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసి, తేనెలతో తయారు చేసిన టీ పొడి దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చక్కటి శ్వాసకు ఎంతో ఉపయోగాలు ఇవి.


పసుపు కలిపిన పాలు

పొడి గొంతు సమస్యలకు, దగ్గు సంబంధిత రుగ్మతలకు పసుపు కలిపిన గోరు వెచ్చటి పాలు చాలా చక్కగా పనిచేస్తాయి. కఫాన్ని కట్ చేసి ఉపశమనాన్ని కలిగిస్తాయి. పసుపు మన భారతీయ ఆహారంలో ప్రధానమైనది. పసుపు లేని కూరే చేయరు భారతీయులు. అన్నింటిలోను పసుపు ఉండాల్సిందే. పసుపు సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేస్తుంది. వ్యాధుల బారి నుంచి కాపాడటమేకాక, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. గ్లాసు వేడిపాలల్లో, చిటికెడు పసుపు వేపి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

నెయ్యి- మిరియాల పొడి

యాంటీ బ్యాక్టీరియల్‌,యాంటీ ఫంగల్‌ లక్షణాలు నెయ్యిలో చాలా పుష్కలంగా ఉంటాయి. ఒక టేబుల్‌ స్ఫూన్‌ వేడి నెయ్యిలో చిటికెడు మిరియాల పొడిని కలిపి తింటే గొంతునొప్పి ఇట్టే పోతుంది. గొంత తడిగా ఉంచడానికి ఇది బాగా పనిచేస్తుంది. అయితే దీనిని తిన్నతర్వాత ఏ విధమైన పానియాలు తాగకుండా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు.

సాల్ట్ వాటర్..

పొడి గొంతు సమస్య నివారణకు తేలికైన, అత్యంత ప్రభావవంతమైన మరొక పద్ధతి ఉప్పు కలిపిన నీటితో పుక్కిలింత. గోరువెచ్చని నీటిలో కాస్తంత ఉప్పు కలిపి రోజుకి రెండు మూడు సార్లు పుక్కిలించాలి. గొంతు పొడిబారటం తగ్గుతుంది. అలాగే దంతాలకు చక్కటి ఆరోగ్యాన్నిస్తుంది. ఇలా చేస్తే..గొంతులో పేరుకుపోయిన జిగట వంటి శ్లేష్మాన్ని కరిగించి పలచబరుస్తుంది. తక్షణ ఉపశమనానికి ఇది చక్కని మార్గం.


హెర్బల్‌ టీ

కాలుష్యం, దుమ్మూ ధూళి వల్ల గొంతులో చికాకుపుట్టించే సమస్యలకు చక్కటి పరిష్కారం హెర్బల్‌ టీ. ఊపిరితిత్తులకు ఇది చాలా చాలా మంచిది. చక్కటి శ్వాసనిస్తుంది. మనం దాదాపు ప్రతీరోజు ఉపయోగించే పచ్చ యాలకులు, లవంగ మొగ్గలు వంటి మసాలా దినుసుల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. వీటితో తయారు చేసిన టీ తాగడం వల్ల కాలుష్యకారకాలైన ధూళికణాలు ఆరోగ్యానికి హాని తలపెట్టకుండా నిరోధించడంలో తోడ్పడుతుంది. అలాగే వీటిని ప్రతీరోజు ఆహారంలో తీసుకుంటే సీజనల్ వ్యాధులనేవే రావు.


మెంతుల డికాషన్‌

మెంతులు. మెంతులు డయాబెటిక్ పేషెంట్లకు ఎంతో ఉపయోగం.అంతేకాదు ఇమ్యునిటీని పెంచటంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి.పలు రకాల గొంతు సమ్యలను నివారించడంతోపాటు, పలు ఆరోగ్య సమస్యల నివారణలో కూడా మెంతులు ఉపయోగపడతాయి. మెంతి గింజలను నీటిలో వేసి రంగు మారేంతవరకు ఉడికించాలి. ఆ తరువాత ఆనీటిని చల్లార్చి, రోజుకు రెండు సార్లు పుక్కిలిపడితే..గొంతు సమస్యలే కాదు దుర్వాసన కూడా హుష్ కాకి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా పొడి దగ్గు, గొంతు పొడిబారడం వంటి రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇంటిలో ఉండే వాటితోనే చక్కటి పరిష్కారాలు పాటించి..సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందుదాం..

 

ట్రెండింగ్ వార్తలు