ఓ వైపు దేశంలో ఆర్థికమాంద్యం నెలకొందంటూ వార్తలు వినిపిస్తుంటే,అలాంటిదేమీ లేదు అంతా బాగానే ఉందంటూ కేంద్రప్రభుత్వం నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్న సమయంలో దేశ ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారాన్ భర్త పరకాల ప్రభాకార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
దీంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన భర్త వ్యాఖ్యలపై స్పందిస్తూ… 2014 నుండి 2019 వరకు మా ప్రభుత్వం ప్రాథమిక సంస్కరణలు చేపట్టింది. వస్తువుల మరియు సేవల పన్ను, ఆధార్, వంట గ్యాస్ పంపిణీ వంటి లిస్ట్ ను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.
సోమవారం(అక్టోబర్-14,2019)ది హిందూ పేపర్ కు రాసిన ఒక ఆర్టికల్ లో పరకాల్ ప్రభాకార్…మోడీ సర్కార్ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పీవీ నరసింహారావు,మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలను అనుసరించాలని సూచించారు. పీవీ,మన్మోహన్ ఆర్థికవిదానాలు బాగున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం నెహ్రూ ఆర్థిక విధానాలను విమర్శించడాన్ని కూడా తప్పుబట్టారు. అధికార పార్టీ చర్య ఆర్థిక విమర్శగా లేదని రాజకీయ దాడిగానే మిగిలిపోయిందని, ఆ విషయాన్ని ఆ పార్టీ ఇంకా గుర్తించడం లేదన్నారు.
దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుందన్నారు. దేశంలో ఒక రంగం తర్వాత మరో రంగానికి సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయని తెలిపారు. వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని ఆయన అన్నారు. ఇదే అసలు సమస్యకు కారణమని అన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తన కొత్త విధానాలను రూపొందించడానికి సుముఖత చూపడంలేదని పరకాల ప్రభాకర్ విమర్శించారు.
ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నా కూడా ప్రభుత్వం ఇంకా తిరస్కరణ ధోరణిలోనే వెళ్తోందన్నారు. దేశంలో డిమాండ్ గణనీయంగా పడిపోయిందన్నారు. నిరుద్యోగిత 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుందన్నారు. వివిధ రంగాల్లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారన్నారు. ఐఎంఎఫ్ కూడా ఆర్థిక వృద్ధి రేటును 6.9 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన విషయాన్ని పరకాల గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత ప్రభుత్వానికి పరకాల ప్రభాకార్ సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే.