దేశంలో కరోనా ఎంతమందికి వచ్చింది. ? ఇదేం ప్రశ్న అనుకోకండి. అధికారిక లెక్కలప్రకారం కోటీ లక్షల మందికి కోవిడ్ సోకింది. కానీ ప్రతి ఐదుగురిలో ఒకరు చొప్పున దేశవ్యాప్తంగా వైరస్ బారినపడ్డారట. ఇకపై కోవిడ్ బారినపడకుండా ఉంచేందుకు వ్యాక్సినేషన్‌ను మరింత ముమ్మరం చేస్తామంటోంది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. భారత్‌లోని 21 శాతం మంది ప్రజల్లో యాంటీబాడీలను గుర్తించామని ప్రకటించింది ఐసీఎంఆర్. దేశవ్యాప్తంగా 28 వేల 589 మంది సామాన్యులు, 7 వేల 171 మంది ఆరోగ్య సిబ్బందిని ఎంచుకుని సెరోలాజికల్ సర్వే చేస్తే ఈ ఫలితాలొచ్చాయట. మొత్తం 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాలను ఎంచుకుని 700 గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించారు.
25.3 శాతం మందికి కరోనా : –
జిల్లాకు 100 మంది ఆరోగ్య సిబ్బందిని పరీక్షించారు. 10-17 ఏళ్ల మధ్య వయస్సున్నవారిలో 25.3 శాతం మంది కరోనా భారినపడి ఉండొచ్చని ఐసీఎంఆర్ వెల్లడించింది. 18 నుంచి 44 ఏళ్ల వయస్సున్నవారిలో 19.9 శాతం, 45 నుంచి 60 ఏళ్ల వయస్కుల్లో 23.4 శాతం, 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో 23.4 శాతం మంది కరోనా సోకి ఉంటుందని అంచనాలున్నాయి. గతేడాది డిసెంబర్ 17 నుంచి ఈ ఏడాది జనవరి 8 వరకు నిర్వహించి సీరోసర్వేలో ఈ తరహా ఫలితాలు వచ్చేసరికి దాని ఆధారంగా దేశవ్యాప్తంగా అంచనా వేశారు. అయితే అధికారిక లెక్కలను చూస్తే.. కోటి ఎనిమిది లక్షల మంది కరోనా భారినపడ్డారు. భారత్‌లో ఇంతవరకు 19 కోట్ల 92 లక్షల కరోనా టెస్ట్‌లు జరిగితే.. కోటి 8 లక్షల మందికి పాజిటివ్ నిర్ధారణయ్యింది. ఇందులో.. లక్షా 51 వేల మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షా 53 వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇంతవరకు కోటి 4 లక్షల మంది రికవరీ అయ్యారు.
వ్యాక్సిన్ అందుబాటులో : –
వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఇకపై కరోనా బారినపడేవారి సంఖ్య మరింతగా తగ్గుతుందని అంచనా వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే గణనీయంగా కేసులు తగ్గాయి. రోజుకు 12, 13 వేల కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఓ వైపు కేసులు తగ్గుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ జోరందుకుంది. ఫిబ్రవరి 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ రెండో డోస్‌నూ ఇవ్వనున్నారు. ఇంతవరకు దాదాపు 46 లక్షల మందికి వ్యాక్సినేషన్ జరిగింది. అత్యంత వేగంగా వ్యాక్సిన్ వేస్తున్న దేశాల్లో ముందున్న భారత్‌లో ఇంతవరకు టీకా తీసుకున్నవారిలో 97 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతోంది.
నిబంధనలు తప్పనిసరి : –
భారత్‌లో 5 వేల 912 ప్రభుత్వ ఆసుపత్రులు, 12 వందల 39 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సినేషన్ జరుగుతోంది. రానున్న రోజుల్లో వ్యాక్సినేషన్ సెంటర్లను మరింతగా పెంచనున్నారు. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 73.6 శాతం ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తే, ఆ తర్వాత స్థానాల్లో 66.8 శాతంతో రాజస్తాన్, 65.5 శాతంతో త్రిపుర నిలిచాయి. 11 రాష్ట్రాల్లో మాత్రం 30 శాతం కంటే తక్కువగా వ్యాక్సినేషన్ జరిగింది. దేశవ్యాప్తంగా చూస్తే 45 శాతం వైద్య ఆరోగ్యసిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చారు. 60 ఏళ్లు పైబడినవారికి త్వరలో వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతోంది కేంద్రం. వ్యాక్సిన్లు తీసుకున్నా మాస్క్ ధారణ, భౌతిక దూరం నిబంధనలు పాటించడం తప్పనిసరి.