Haryana Hockey Players : హర్యానా హాకీ క్రీడాకారిణులకు భారీ నజరానా

టోక్యో ఒలింపిక్స్‌ లో ఆడిన జట్టులో భాగమైన హర్యానా హాకీ క్రీడాకారిణులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాను అందించింది. సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు.

Haryana Hockey Players

rewards for Haryana hockey players : టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పోరులో భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు పోరాడి ఓడింది. నిజానికి భారత మహిళా జట్టు స్ఫూర్తిదాయ‌క‌మైన ఆట‌ను ప్ర‌ద‌ర్శించింది. టోక్యో ఒలింపిక్స్‌ లో ఆడిన జట్టులో భాగమైన హర్యానా హాకీ క్రీడాకారిణులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాను అందించింది. సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. మొత్తం తొమ్మిది మందికి ఈ నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. భారత మహిళా హాకీ జట్టు అద్భుత ప్రదర్శనను కొనియాడారు. పోరాట పటిమ కనబరిచారంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు.

కాగా భారత మహిళా హాకీ ఒలింపిక్‌ చరిత్రలో రాణి సేన తొలిసారి సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సెమీ ఫైనల్‌లో ఓడిన మహిళల జట్టు.. శుక్రవారం కాంస్యం కోసం జరిగిన పోరులో బ్రిటన్‌తో హోరాహోరీగా పోరాడారు. చివరి వరకు పోరాడినా.. ఫోర్త్ క్వార్ట‌ర్స్‌లో వెనుకడుగు వేశారు. ఒకానొకదశలో భారత టీం పతాకంపై ఆశలు రేకెత్తించింది. కానీ చివరకు ఓటమి చవి చూసింది.

చివరి క్వార్టర్‌లో ప్రత్యర్థి జట్టు పైచేయి సాధించడంతో 4-3 తేడాతో ఓటమి పాలయ్యారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 4-3 గోల్స్ తేడాతో బ్రిట‌న్ కాంస్య ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది. తొలి క్వార్ట‌ర్‌లో రెండు జ‌ట్లు గోల్ చేయ‌లేక‌పోయాయి. స‌వితా పూనియా అద్భుత‌మైన రీతిలో గోల్ పోస్టు వ‌ద్ద బ్రిట‌న్ దూకుడును అడ్డుకుంది. ఇక సెకండ్ క్వార్ట‌ర్‌లో గోల్స్ వ‌ర్షం కురిసింది. బ్రిట‌న్ రెండు గోల్స్ చేయ‌గా.. భారత్ మూడు గోల్స్ చేసింది. గుర్జిత్ కౌర్ రెండు గోల్స్ చేసింది. మ‌రో ప్లేయ‌ర్ వంద‌నా క‌టారియా త‌న డ్రాగ్ ఫ్లిక్‌తో మ‌రో గోల్‌ను ఇండియాకు అందించింది.