Taj Mahal House: వావ్.. మధ్యప్రదేశ్‌లో మరో తాజ్ మహల్.. భార్య కోసం కట్టించిన భర్త.. చూస్తే అద్భుతం అనాల్సిందే..

అచ్చం తాజ్ మహల్ ని తలపిస్తున్న ఆ ఇంటిని చూసి అంతా మైమరిచిపోతున్నారు. ఆనంద్ ప్రకాశ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Taj Mahal House: భార్యపై తనకున్న ప్రేమను ఓ భర్త వినూత్న రీతిలో చూపించాడు. ఆమె కోసం తాజ్ మహల్ ని పోలిన ఇంటిని కట్టించాడు. దీన్ని తన భార్యకు కానుకగా ఇచ్చాడు. ఆ ఇల్లు చూడటానికి అచ్చం తాజ్ మహల్ లానే ఉండటం విశేషం. ఆ ఇంటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజ్ మహల్ ని పోలిన ఆ ఇంటిని చూసి అంతా అవాక్కవుతున్నారు. వావ్ సూపర్ అని అనకుండా ఉండలేకపోతున్నారు.

ఆయన పేరు ఆనంద్ ప్రకాశ్ చౌక్సే. మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ లో నివాసం ఉంటారు. ఓ స్కూల్ ని నిర్వహిస్తున్న ఆనంద్ ప్రకాశ్.. ఆ పాఠశాల ప్రాంగణంలోనే తాజ్ మహల్ లాంటి ఇంటిని కట్టించుకున్నారు. ఇది 4 BHK విల్లా తరహా పాలరాయి భవనం. ఒరిజినల్ తాజ్ మహల్‌ నిర్మాణంలో వాడిన మక్రానా పాలరాతితోనే ఆయన తన ఇంటిని నిర్మించడం విశేషం.

పరిమాణం పరంగా చూసుకుంటే ఇది ఆగ్రా తాజ్ మహల్ కన్నా చిన్నది. ఆగ్రా తాజ్ మహల్ తో పోలిస్తే మూడింట ఒక వంతు మాత్రమే ఉంటుంది. కానీ, నాలుగు వైపులా పిల్లర్లు, డోమ్ అన్నీ ఒరిజినల్ ఆగ్రా తాజ్ మహల్ మాదిరిగానే ఉంటాయి. 50 ఎకరాల విశాలమైన స్థలంలో దీన్ని నిర్మించారు.

ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.2కోట్లు ఖర్చు చేశారు ఆనంద్ ప్రకాశ్. ఈ ఇంటికి సంబంధించిన వీడియోను ప్రియమ్ సరస్వత్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. అచ్చం తాజ్ మహల్ ని తలపిస్తున్న ఆ ఇంటిని చూసి అంతా మైమరిచిపోతున్నారు. ఆనంద్ ప్రకాశ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తన భార్యపై తనకు ఎంతో ప్రేమ ఉందన్నారు ఆనంద్ ప్రకాశ్. ప్రేమకు చిహ్నం తాజ్ మహల్. అందుకే, తన ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు వెల్లడించారు. అచ్చం తాజ్ మహల్ ని పోలిన ఇంటిని నిర్మించి ఆమెకు కానుకగా ఇచ్చానని, అలా ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నానని ఆనంద్ ప్రకాశ్ వివరించారు.