Police Case
Police Case : ఏడాదికి క్రితం పెళ్లయింది. దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య తల్లిగారి ఇంటికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే భర్త విసిగించడం మొదలు పెట్టాడు. అతడి వేధింపులు తట్టుకోలేని భార్య.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త భార్యపై కాల్పులు జరిపాడు.. బులెట్ పక్కకు వెళ్లడంతో ఆమె గాయాలతో బయటపడింది.. కాగా ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని మంగళ్ పురికి చెందిన మోనిక, మోహిత్ లకు ఏడాది క్రితం పెళ్లైంది. మోహిత్ నిరుద్యోగి. పెళ్లైన కొద్దీ రోజులకే వీరిమధ్య గొడవ ప్రారంభమైంది. భర్త వేధింపులు తాళలేని మోనిక తల్లిగారింటికి వెళ్ళిపోయింది. మోనిక తల్లిగారి ఇల్లు మోహిత్ ఇంటికి సమీపంలోనే ఉండటంతో.. రోజు వెళ్లి మోనిక తల్లిదండ్రులతో గొడవపడుతుండేవాడు. ఇంటికి రావాలని భార్యతో వాగ్వాదానికి దిగేవాడు. రోజు రోజుకు మోహిత్ ఆగడాలు ఎక్కువవుతుండటంతో బుధవారం పోలీసులకు ఫోన్ చేసి తెలిపింది.
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. కేసు విషయమై.. మోహిత్ కు ఫోన్ చేశారు పోలీసులు.. అతను బయట ఉన్నానని.. సాయంత్రం వరకు స్టేషన్ కి వస్తానని తెలిపాడు. అటు నుంచి మోనిక పుట్టింటికి వెళ్లి ఆమెతో గొడవపడ్డారు. అనంతరం తన వెంట తెచ్చుకున్న గన్ తో కాల్పులకు తెగబడ్డారు. గురితప్పడంతో మోనిక స్వల్ప గాయాలతో బయటపడింది.
దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో వారు మోనిక ఇంటికి వచ్చారు. అప్పటికీ మోహిత్ చేతిలో తుపాకీ ఉన్నది. పోలీసులను చూసి అక్కడి నుంచి పారిపోతున్న అతన్ని స్థానికుల సహాయంతో పట్టుకున్నామని డీసీపీ పర్విందర్ సింగ్ చెప్పారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను దవాఖానకు తరలించామని, మోహిత్‌ను అరెస్టు చేసి, వివిధ సెక్షన్ల కింది కేసు నమోదుచేశామన్నారు