By 2024, our road infrastructure will be equal to standard of USA, says Nitin Gadkari
Nitin Gadkari: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ యాత్ర గురించి తాను వినలేదని, అలాగే, రాహుల్ గాంధీ చెప్పేది కూడా తాను విననని అన్నారు. తాను బరువు పెరిగిపోయిన సమయంలో పాదయాత్ర చేయాలని కొందరు తనకు సూచించారని చెప్పారు. రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్రను ఆ కారణం వల్లే చేశారని చురకలంటించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, బీజేపీ ద్వేషాన్ని పంచే దుకాణాన్ని ప్రారంభించిందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై నితిన్ గడ్కరీ స్పందిస్తూ అందులో నిజం లేదని చెప్పారు. తాము ఏ రకమైన వివక్షనూ నమ్మబోమని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరినీ, ప్రతి వర్గాన్ఇన దృష్టిలో పెట్టుకునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రణాళికలు వేసుకుంటుందని చెప్పారు.
దేశ వ్యాప్తంగా రైతులకు ఆర్థిక సాయం అందిస్తూనే ముస్లింలకు కూడా డబ్బు ఇస్తున్నాం కదా? అని అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ప్రజల మెదళ్లలో భయం నింపే ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. ఆ పార్టీకి 2024 ఎన్నికల్లో ప్రజలు గట్టిగా సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. కాగా, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి ప్రారంభించిన భారత్ జోడో యాత్ర ఇటీవలే కశ్మీర్ లో ముగిసింది.