I tried to convince Uddhav Thackeray to go with BJP says Eknath Shinde
Maharashtra: భారతీయ జనతా పార్టీతో కలవమని ఉద్ధవ్ థాకరేను ఒప్పించేందుకు తాను చాలా ప్రయత్నించానని, అయితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు. ప్రజా తీర్పు మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, బాలాసాహేబ్ బాల్‌థాకరే ఆశయాలు కూడా అవేనని తాను విశ్వసిస్తానని, అయితే అందుకు విరుద్ధంగా ఉద్ధవ్ వెళ్లారని ఆయన అన్నారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘‘ఇలా ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అనేది మహారాష్ట్రలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఇది ఏదో ముఖ్యమంత్రి పదవి కోసం జరిగింది కాదు. మేము (శివసేన) బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశాము. ప్రజలు మా కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని తీర్పు చెప్పారు. కానీ ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పడింది. అందుకు మా ఎమ్మెల్యేల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
అయినప్పటికీ.. మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అని ప్రజలతో పాటు మా ఎమ్మెల్యేలు కూడా ఆశించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. కనీసం మా ఎమ్మెల్యేలకు కూడా పని చేసే వీలు కల్పించలేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చుకోలేదని భావించిన మా ఎమ్మేల్యలు తిరుగుబాటు చేయక తప్పలేదు. అప్పటికే ఉద్ధవ్ థాకరేకు నచ్చ జెప్పడానికి ప్రయత్నించాం. కానీ బీజేపీతో ఆయన కలవనని చెప్పారు’’ అని షిండే అన్నారు.