Iaf
IAF కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ వైమానిక దళాన్ని(IAF) కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. దేశ వ్యాప్తంగా వివిధ కోవిడ్-19 ఆసుపత్రులు, సెంటర్లకు.. ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు, మందులను రవాణా చేసేందుకు ఐఏఎఫ్ విమానాలను వినియోగించుకోనున్నారు. దేశంలో ముఖ్యంగా పలు హాస్పిటల్స్ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
విమానాల ద్వారా అత్యవసరమైన అన్ని మందులు, వైద్య పరికరాలను రవాణా చేస్తామని వైమానిక దళ అధికారులు తెలిపారు. తద్వారా కరోనా వైరస్ పై జరిపే పోరులో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామన్నారు. కొచ్చి, ముంబై, వైజాగ్, బెంగుళూరు నుంచి డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని ఐఏఎఫ్ విమానాల ద్వారా ఢిల్లీకి తరలిస్తున్నారు. తాత్కాలిక హాస్పిటల్‌లో వాళ్లు సేవలు అందిచనున్నారు. బెంగుళూరు నుంచి ఢిల్లీకి డీఆర్‌డీవో ఆక్సిజన్ కంటైనర్లను వైమానిక దళ విమానాల్లో తీసుకెళ్తున్నారు.
కాగా,ఇటీవలే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్..దేశంలో కరోనా పరిస్థితిపై త్రివిధ దళాధిపతితో పాటు త్రివిధ దళాల చీఫ్‌లతో వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలనీ ఆయన అధికారులను ఆదేశించారు. రిటైర్ అయిన సైనిక డాక్టర్లు, నర్సులను వాలంటరీ సేవల కోసం వినియోగించుకోవాలని రక్షణ మంత్రి సూచించారు.
మరోవైపు, ఇతర రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ సరఫరాను పలు రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయన్న వార్తల నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరాపై గురువారం రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ ఆదేశాలు జారీ చేశారు. రవాణాలో ఆటంకాలు తలెత్తకుండా స్వేచ్ఛాయుత సరఫరా కోసం.. రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలని ఆ లేఖలో హోంశాఖ సూచించింది. అంతరాష్ట్ర రవాణాకు ఆటంకం లేకుండా చూడాలని పేర్కొంది. అలాగే.. నగరాల మధ్య కూడా రవాణాపై ఆంక్షలు విధించొద్దని తెలిపింది .తమ ప్రాంతం గుండా వెళ్లే ఆక్సిజన్ వాహనాలను.. నిర్దిష్ట ప్రాంతాలకు మళ్లించే అధికారం ఎవరికీ లేదు. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన 9 సంస్థలు తప్ప మిగతా పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్‌ను వినియోగించొద్దు అని ఆ లేఖలో పేర్కొంది.