Zika In Pune : పుణెలో జికా వైర‌స్ తొలి కేసు న‌మోదు

కేరళలో జికా వైరస్ కేసులు బయటపడిన విషయం తెలిసిందే.కానీ తాజాగా జికా విస్తరిస్తోంది అనటానికి నిదర్శనంగా మ‌హారాష్ట్ర‌లోనూ జికా కేసు నమోదు అయ్యింది. మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని బెల్సర్ గ్రామంలో ఓ మ‌హిళ‌లో జికా వైర‌స్ బారిన ప‌డిన‌ట్లు అధికారులు గుర్తించారు.

1st Case Of Zika Virus In Maharashtra

Zika virus In Pune : కేరళలో జికా వైరస్ కేసులు బయటపడిన విషయం తెలిసిందే.కానీ తాజాగా జికా విస్తరిస్తోందో అనటానికి నిదర్శనంగా మ‌హారాష్ట్ర‌లోనూ జికా కేసు నమోదు అయ్యింది. మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని బెల్సర్ గ్రామంలో ఓ మ‌హిళ‌లో జికా వైర‌స్ బారిన ప‌డిన‌ట్లు అధికారులు గుర్తించారు. మ‌హిళ‌కు జికా వైర‌స్ సోకిన‌ట్లు తేల‌గానే ఆరోగ్యశాఖ అప్ర‌మ‌త్త‌మైంది. ఫాగింగ్‌, క్లీనింగ్ లాంటి నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. మ‌రోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం ఇంకా పూర్తిగా త‌గ్గ‌లేద‌ని తెలిపారు.

కొల్హాపూర్‌, సాహ్ని, స‌తారా, పుణె జిల్లాల్లో క‌రోనా వైర‌స్ విస్తృతి ఎక్కువ‌గా ఉన్న‌ద‌ని మంత్రి తెలిపారు. రాష్ట్ర స‌గ‌టుతో పోల్చుకుంటే ఈ నాలుగు జిల్లాల్లో పాజిటివిటీ రేటు చాలా ఎక్కువ‌గా ఉందనీ.. అందుకే ఆ నాలుగు జిల్లాల్లో ట్రాకింగ్‌, ట్రేసింగ్, టెస్టింగ్ లాంటి కొవిడ్ ప్రొటోకాల్స్‌ను కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు. ఈ మ‌ధ్య భారీ వ‌ర్షాల కార‌ణంగా పోటెత్తిన వ‌ర‌ద‌లు త‌మ ప‌నుల‌కు ఆటంకం క‌లిగించాయని తెలిపారు.కాగా పూనెలో జికా వైరస్ కేసు కలకలం రేపిన అనంతరం కేంద్ర నిపుణుల బృందం పూణెలో పర్యటిస్తోంది. ముగ్గురు సభ్యుల టీమ్ తో పాటు పూనె డైరెక్టర్ కార్యాలయం నుంచి పబ్లిక్ నిపుణుడు, అలాగే న్యూఢిల్లీలోని లేడీ హార్డింగే మెడికల్ కాలేజీకి చెందిన గైనకాలజిస్ట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ నుండి ఓ సైంటిస్టు ఈ బృందంలో ఉన్నారు.

అసలు జికా వైరస్ అంటే ఏంటి..? ఎవరిపై ప్రభావం చూపుతోంది..?లక్షణాలు ఎలా ఉంటాయి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

డెంగ్యూ, మలేరియా మాదిరిగానే జికా కూడా జికా కూడా ఒక రకమైన వైరస్. ఇది దోమ కాటు వలన వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రధానంగా ఈడెస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ జికా వైరస్‌కు పగటిపూట కుట్టే దొమలే కారణమని నిపుణులు చెబుతున్నారు. డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి కూడా ఇదే దోమ కారణం. జికా వైరస్‌ను 1947 లో ఆఫ్రికాలో మొదటగా గుర్తించడం జరిగింది. అయితే 2015 లో బ్రెజిల్‌లో వ్యాప్తి చెందింది. అలా నెమ్మదిగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతూ.. భారత్‌లోనూ ఈ కేసులు వెలుగు చూశాయి. సాధారణంగా ఈ వైరస్ ఈడెస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉందంటున్నారు. కాగా, జికా ను ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.

జికా సోకితే లక్షణాలు : జికా సోకిన వారిలో కనిపించే మొదటి లక్షణం జ్వరం. డెంగ్యూ బారిన పడిన వారికి ఉన్న లక్షణాలే జికా సోకిన వారిలోనూ ఉంటాయి. కానీ రోగ నిర్ధారణ చేయడం చాలా కష్టమనే చెప్పాలి. చాలా మంది రోగులు ఫ్లూ లక్షణాలుగా భావించి నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. తాము జికా బారిన పడ్డామని తెలుసుకోవటానికే చాలా టైమ్ పడుతుంది. జికా బారిన పడిన వారిలో తీవ్రమైన జ్వరం, తరచుగా ముక్కు కారడం, తలనొప్పి, దద్దుర్లు ఒక వారం పాటు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి.

కొంతమందికి కళ్ల కలక, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి కూడా వస్తుంది. దీని బయటపడేందుకు రెండు నుంచి ఏడు రోజుల సమయం పడుతుంది. ఇక అరుదైన సందర్భాల్లో జికా వైరస్ కూడా ఆటో ఇమ్యూన్ ఇన్‌ఫెక్షన్లకు కారణం అవుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. జికా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక.. మెదడు, వెన్నుపాము ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. నాడీ సంబంధిత రుగ్మతలు ఏర్పడుతాయి. దీని వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్‌ వంటి వ్యాధులను వ్యాప్తి చెందించే ఎడిస్‌ రకానికి చెందిన దోమల ద్వారానే జికా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. ఇవి పగలు మాత్రమే కుడతాయి. లైంగిక ప్రక్రియ ద్వారా, రక్తం ద్వారా కూడా వ్యాపిస్తుంది. గాలి, నీళ్లు, బాధితులను తాకడం వంటి వాటి ద్వారా ఇది సోకే అవకాశం లేదు. రక్త పరీక్ష ద్వారా ఈ ఇన్ఫెక్షన్‌ను గుర్తిస్తారు. ప్రతి పది మందికిగాను ఇద్దరిలో మాత్రమే లక్షణాలు ఉంటాయి. వ్యక్తులను బట్టి శరీరంలో 3 రోజుల నుంచి 14 రోజుల మధ్య ఈ వైరస్‌ సంఖ్యను పెంచుకుని, లక్షణాలు బయటపడతాయి. వారం రోజుల్లోగా వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. జికాకు సంబంధించి ప్రత్యేకంగా చికిత్సగానీ, వ్యాక్సిన్‌గానీ ప్రస్తుతం అందుబాటులో లేవు. లక్షణాలను బట్టి సాధారణ మందులనే ఇస్తారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌పై పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.