డిసెంబర్-9న….కర్ణాటకలో మళ్లీ జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్!

కర్ణాటకలో ఈ నెల 5న 15 శాసనసభ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెల్చుకుంటే మరోసారి జేడీఎస్ తో జట్టు కట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలిన తర్వాత రెండు పార్టీల నాయకుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. సిద్ధరామయ్య,దేవేగౌడ మధ్య మాటల తూటాలు కూడా పేలాయి. అయితే ఇలాంటి సమయంలో ఆదివారం(డిసెంబర్-1,2019) కాంగ్రెస్ సీనియర్ లీడర్,మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉప ఎన్నికల్లో ఆరుస్థానాల్లో బీజేపీ విజయం సాధించకపోతే యడియూరప్ప సర్కార్ కూలిపోతుందని ఆయన అన్నారు. తమ పార్టీకే ఉప ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్-9న ఉప ఎన్నికల ఫలితాలు వెలువడతాయని,అప్పుడు జేడీఎస్ తో మరోసారి కలిసి కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పరమేశ్వర తెలిపారు. ఒకవేళ అలా జరుగకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావచ్చని,లేదా మళ్లీ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశముందని ఆయన తెలిపారు.

అయితే మధ్యంతర ఎన్నికల పట్ల తాము ఆశక్తి చూపడం లేదని,జేడీఎస్ తో కలిసేందుకే ఇష్టపడుతున్నట్లు తెలిపారు. మరోసారి ఎన్నికలకు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలిగించదల్చుకోవడం లేదన్నారు. జేడీఎస్ తో మరోసారి పొత్తులో ఎలాంటి తప్పు లేదన్నారు. అయితే ఈ విషయంపై జేడీఎస్ తో ఇప్పటివరకు చర్చలు జరుపలేదని,ఉప ఎన్నికల ఫలితం రోజు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడు,మాజీ సీఎం సిద్దరామయ్య కూడా ఉప ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదన్నారు. కాంగ్రెస్ 12 స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.