If Oppn considers Nitish Kumar maybe strong candidate for PM says Tejashwi Yadav
Bihar: బిహార్ రాజకీయాల్లో కొద్ది రోజులుగా స్వైర విహారం చేస్తున్న రహస్యంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ కీలక నేత తేజశ్వీ యాదవ్ స్పందించారు. విపక్ష పార్టీలు ఒప్పుకుంటే వచ్చే ఎన్నికల్లో బలమైన ప్రధానమంత్రి అభ్యర్థి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమారే అవుతారని ఆయన స్పష్టతనిచ్చారు. భారతీయ జనతా పార్టీకి పోటీగా 2024లో బలమైన ప్రత్యర్థి కావాలంటే నితీశ్‌ను ముందు వరుసలో నిలబెట్టొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆదివారం ఆయన పీటీఐతో మాట్లాడుతూ ‘‘నితీశ్ కుమార్ మంచిపేరు ఉన్న వ్యక్తి. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటే మంచిదే. విపక్షాలు ఒప్పుకుంటే నితీశ్ బలమైన ప్రధానమంత్రి అభ్యర్థి అవుతారు’’ అని అన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ విమర్శలపై స్పందిస్తూ ‘‘వారిది(బీజేపీ) తోడేళ్ల ఏడుపు. ఏదో ఒకటి అనడం తప్పితే వారు చేసేదేమీ ఉండదు. మాట మాట్లాడితే జంగిల్ రాజ్ అంటారు. అది అరిగిపోయిన మాట’’ అని అన్నారు.
బిహార్‌లో జేడీయూ-ఆర్జేడీ కలిసిపోయినప్పటి నుంచే నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు గుసగుసలు వినిపించాయి. కొద్ది రోజుల్లో తేజశ్వీని ముఖ్యమంత్రి చేసి, ఆయన ప్రధాని మంత్రి పదవికి పోటీ పడతారని చెప్పుకుంటున్నారు. ఎట్టకేలకు ఈ గుసగుసలకు తెర దించుతూ తేజశ్వీ యాదవ్ క్లారిటీ ఇచ్చారు.
రాహుల్ గాంధీ సముఖంగా లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించే పరిస్థితిలో లేదు. ఇక జాతీయ హోదా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా మాయావతి పేరు ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పటికీ.. ఆ పార్టీ అంతగా ప్రభావం చూపడం లేదు. పైగా విపక్షాలు ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. ఇక ఇతర ప్రాంతీయ పార్టీలేవీ తమ రాష్ట్రాలు దాటి ప్రభావం చూపలేవు. బయటికి రావడానికి కూడా అంత సముఖంగా లేవు. దీంతో నితీశ్ అభ్యర్థిత్వం ఖరారు చేసుకునేందుకు బిహార్ పార్టీలు పావులు కదుపుతున్నాయి.