ఉత్తరప్రదేశ్ అక్రమ ఇసుక మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి, హమిర్పూర్ జిల్లా మాజీ డీఎం(డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్) బి. చంద్రకళకు శుక్రవారం(జనవరి 18,2019) ఈడీ సమన్లు జారీ చేసింది.జనవరి 24న రాజధాని లక్నోలోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని చంద్రకళకు ఈడీ సమన్లు జారీ చేసింది. చంద్రకళతో పాటు మరో ముగ్గురుకి కూడా ఈడీ ఈ కేసులో సమన్లు జారీ చేసింది.సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ కుమార్ మిశ్రా కూడా సమన్లు అందుకొన్నవారిలో ఉన్నారు. జనవరి 28న మిశ్రా ఈడీ ఎదుట విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. 2012-16 మధ్యకాలంలో హమిర్పూర్ జిల్లాలో జరిగిన అక్రమమైనింగ్ వ్యవహారంలో అధికారులు, రాజకీయ నేతల సంబంధంపై సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ గురువారం ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్(PMLA) కింద ఈడీ కేసు నమోదుచేసింది. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, అతని పార్టీ ఎస్పీకి అక్రమమైనింగ్ లో పాత్ర ఉందన్న ఆరోపణలపై ఈడీ విచారణ చేస్తోంది.
జనవరి 2న అక్రమమైనింగ్ కి సంబంధించి చంద్రకళతో సహా 11మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. జనవరి 5న లక్నో, నోయిడాలోని చంద్రకళ ఇళ్లల్లో సీబీఐ సోదాలు నిర్వహించి రెండు బ్యాంక్ అకౌంట్లు, ఒక లాకర్, కొన్ని కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. కాన్పూర్ లోని మిశ్రా ఇంట్లో కూడా సీబీఐ సోదాలు నిర్వహించింది. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ని కూడా సీబీఐ విచారించే అవకాశముంది.