Monsoon : నైరుతి రుతుపవనాల రాకపై ఐఎండీ కీలక ప్రకటన

Monsoon : మన దేశ ఆర్థిక వ్యవస్థకు నైరుతి రుతుపవనాలు చాలా కీలకం. వాటి రాక ఆలస్యం అయితే ఆ ప్రభావం ఖరీఫ్ సీజన్ పై పడే అవకాశం..

Monsoon – IMD : నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. ఇప్పటివరకు వాటి జాడ లేదు. ఇప్పటికే కేరళ తీరాన్ని తాకి విస్తృతంగా వర్షాలు పడాల్సిన సమయంలో ఇంకా ఆ రాష్ట్రంలోనే ప్రవేశించలేదు. రుతుపవనాలు కేరళను ఎప్పుడు తాకుతాయో కూడా సరైన సమాచారం లేదు. మరో నాలుగు రోజులు పట్టొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకాలి. గతంలో ఇంత ఆలస్యమైన సందర్భం లేదు. బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణం, ఎల్ నినో పరిస్థితులు, సముద్ర ఉష్ణోగ్రతల కారణంగా రుతుపవనాలు కేరళలో ప్రవేశించేందుకు ఆలస్యం అవుతుందని ఐఎండీ ప్రకటించింది. 20 రోజుల క్రితం అండమాన్ దీవుల్లో బంగాళాఖాతంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు సకాలంలో కేరళలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read..TSPSC : 15నిమిషాలు దాటితే నో ఎంట్రీ, మరో ఓఎంఆర్ షీట్ ఇవ్వరు, ఆధార్ మస్ట్.. గ్రూప్-1 పరీక్షకు TSPSC పటిష్ట చర్యలు

కానీ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రుతుపవనాల కదలిక నెమ్మదించింది. దీంతో కేరళ తీరానికి రుతుపవనాలు ఆలస్యంగా రానున్నాయి. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ గాలులు పెరిగినందున రుతుపవనాల కదలికకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘావర్తనం పెరుగుతున్నందున వచ్చే మూడు నాలుగు రోజుల్లో రుతుపవనాలు కేరళను చేరటానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని అంచనా వేస్తోంది ఐఎండీ.

మన దేశ ఆర్థిక వ్యవస్థకు నైరుతి రుతుపవనాలు చాలా కీలకం. వాటి రాక ఆలస్యం అయితే ఆ ప్రభావం ఖరీఫ్ సీజన్ పై పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం సాగు విస్తీరణంలో 52శాతం వర్షం.. సాధారణ వర్షపాతం మీదే ఉంటుంది. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తితో పాటు రిజర్వాయర్ల భర్తీకి కూడా ఇది కీలకం. దేశంలో వర్షాధార వ్యవసాయం 40శాతం వరకు ఉంది.

నైరుతి రుతుపవనాలు గతేడాది మే 29న, 2021లో జూన్ 3న కేరళలో ప్రవేశించాయి. 2020లో జూన్ 1, 2019లో జూన్ 8న, 2018లో మే 29న ఆ రాష్ట్ర తీరాన్ని తాకాయి. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైనా ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Also Read..Rahul Gandhi: తదుపరి టార్గెట్ తెలంగాణ ఎన్నికలు.. ఏం చేస్తామంటే?: అమెరికాలో రాహుల్ గాంధీ కామెంట్స్

మన దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలాన్ని నైరుతి రుతుపవనాల కాలంగా పరిగణిస్తారు. ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ఏప్రిల్ 10న ప్రకటించింది. కరవు ఏర్పడేందుకు 20శాతం అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. కానీ, అందుకు కాస్త విరుద్ధంగా ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ప్రకటించింది. దేశంలో 2019 రుతుపవనాల సీజన్ లో 971.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2020లో వర్షపాతం 961.4 మిల్లీమీటర్లుగా ఉంది. 2021లో 874.5 మిల్లీమీటర్లు, 2022లో 924.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు