IT Raids On UP YouTuber Tasleem House
YouTuber Tasleem : సాధారణంగా వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు,సెలబ్రిటీల ఇళ్లపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లో ఓ యూట్యూబర్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు (Income Tax ) నిర్వహించారు. బరేలీలోని తస్లీమ్ (Taslim) అనే యూట్యూబర్ ఇంటిపై జులై 15న ఐటీ అధికారులు దాడులు చేసి రూ. 24 లక్షలను అధికారులు గుర్తించారు. ఇంకా బంగారు నగలు, విలువైన వస్తువుల్ని గుర్తించారు. ఈ వస్తువులు తస్లీం తల్లిదండ్రులవని అతని తమ్ముడు చెబుతున్నాడు.
కొన్నేళ్లుగా తస్లీమ్ యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తున్నాడు. అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడనే ఆరోపణలతో ఈ దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. తస్లీమ్ ‘ట్రేడింగ్ హబ్3.0’ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ లో షేర్ మార్కెట్ కు సంబంధించిన వివరాలు చెబుతు వీడియోలు చేస్తుంటాడు.
Tomato Farmers Millionaires : టమాటాలు పండించి కోటీశ్వరులైన రైతులు..
ఐటీ దాడులు జరిగిన విషయంపై తస్లీమ్ తమ్ముడు ఫిరోజ్ మాట్లాడుతు.. తస్లీమ్ ఎలాంటి తప్పులు చేయలేదని.. తన యూట్యూబ్ అకౌంట్ ‘ట్రేడింగ్ హబ్ 3.0’ (Trading Hub 3.0) ద్వారా షేర్ మార్కెట్ సంబంధిత వీడియోలు పోస్ట్ చేస్తుంటాడని… సంపాదనపై వచ్చే ఆదాయానికి ట్యాక్స్ కూడా కడుతున్నాడని తెలిపాడు. యూట్యూబ్ ద్వారా వచ్చిన రూ. 1.2 కోట్ల ఆదాయానికి ఇప్పటికే రూ. 4 లక్షల పన్ను కట్టామని తెలిపాడు. తాము ఎటువంటి తప్పు చేయలేదని, కుట్ర ప్రకారమే ఐటీ దాడులు జరిగినట్టు అనిపిస్తోందని తెలిపాడు.
కాగా.. యూట్యూబర్స్ ఇళ్లపై ఐటీ దాడులు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో, కేరళలోని అనేక మంది యూట్యూబర్‌ల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహించింది. ఈ యూట్యూబర్‌లు యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంపై సరిగా పన్నులు చెల్లించడం లేదని ఐటీ గుర్తించింది. భారతీయ యూట్యూబర్‌లు తమ సంపాదనపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వారి స్థూల మొత్తం ఆదాయం రూ. 1 కోటి దాటితే, అప్పుడు వారు పన్ను ఆడిట్ చేయించుకోవాలి.