Increase In Gdp Increase In Gas Diesel Petrol Prices Rahul Gandhi
GDP దేశంలో గ్యాస్,డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీడీపీ పెరుగుతోందని ప్రధాని మోదీ ఎప్పుడూ చెబుతుంటారని,జీడీపీ వృద్ధి బాటలో పయనిస్తోందని ఆర్థిక మంత్రి అంటుంటారని..అయితే వారు చెప్పే జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ అని తనకు తర్వాత అర్థమైందని రాహుల్ వ్యంగస్త్రాలు సంధించారు. 2014 తర్వాత అంతర్జాతీయంగా ఇంధన ధరలు తక్కువగానే ఉన్నాయని.. భారత్‌లో మాత్రం ధరలను పెంచుతూనే ఉన్నారని ధ్వజమెత్తారు. గత 7 ఏళ్లలో డీజిల్,వంట గ్యాస్,పెట్రోల్ ధరల పెరుగుదల ద్వారా ప్రభుత్వం రూ. 23 లక్షల కోట్లు సంపాదించిందని తెలిపారు.
2014లో యూపీఏ ప్రభుత్వం దిగిపోయే సమయంలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.410గా ఉండగా.. ఇప్పుడది 116 శాతం పెరుగి రూ.885కి చేరిందని…. పెట్రోల్ లీటర్ రూ.71.5, డీజిల్ రూ.57 ఉండేది కాగా.. ఇప్పుడు ఈ ధరలు రూ.101, రూ.88కి పెరిగిపోయాయన్నారు. రైతులు, శ్రామికులు, చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు, ఉద్యోగుల నుంచి మోదీ సర్కార్ పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేసి..4-5 స్నేహితుల జేబులు నింపుతోందని రాహుల్ విమర్శించారు. ప్రజలను ఖాళీ కడుపులతో పడుకోబెట్టి.. తాను మాత్రం స్నేహితుల నీడలో హాయిగా నిద్రపోతున్నాడంటూ పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ విమర్శించారు. అన్యాయానికి వ్యతిరేకంగా దేశం ఏకమవుతుందన్నారు.
జలియన్‌వాలా బాగ్ ఆధునికీకరణపై మరోసారి కేంద్రంపై రాహుల్ విమర్శలుగుప్పించారు. జలియన్‌వాలా స్మారక ప్రాంగణం ఆధునీకరించటం.. అమరులను అవమానపరచడమేనని.. బలిదానానికి అర్థం తెలియని వ్యక్తులు మాత్రమే అలాంటి వాటికి పాల్పడతారని విమర్శించారు. అక్కడ డిస్కో లైట్ల వంటివి ఏర్పాటు చేయడం వల్ల అదో వేడుక ప్రదేశంగా మారుతుందే తప్ప ఆనాటి మారణహోమం తీవ్రతను గుర్తుచేయదన్న ఉద్దేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, బుధవారం చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్‌పై రూ.25 పెంచిన విషయం తెలిసిందే. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో రూ.884.50కు చేరింది. ఇంతకు ముందు ఆగస్ట్ 18న గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగ్గా.. గత జనవరి నుంచి సిలిండర్‌పై రూ.190 వరకు పెరిగింది. ఇవాళ 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.75 పెరగ్గా.. ప్రస్తుతం ధర రూ.1,693కు చేరింది.