flights
Increase fares of Domestic flight : దేశీయ విమానప్రయాణికులపై భారం పడనుంది. ఛార్జీలు 30శాతం వరకూ పెరగనున్నాయి. దేశీయ విమాన ఛార్జీల కనిష్ట, గరిష్ట పరిమితులను పౌరవిమానయాన మంత్రిత్వశాఖ 10నుంచి 30శాతం వరకూ పెంచింది. దీనివల్ల విమానప్రయాణికులపై భారం పడనుంది. అదే సమయంలో కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలకు మాత్రం ఈ నిర్ణయం కాస్త ఊపిరినివ్వనుంది.
ఈ కొత్త పరిమితులు ఈ ఏడాది మార్చి 31 లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ అమల్లో ఉంటాయి. 90నుంచి 120 నిముషాల జర్నీకి ప్రస్తుతం కనిష్ఠ చార్జి 3వేల 5వందల వరకూ ఉండగా ఇప్పుడు అది 3వేల 9వందల వరకూ పెరిగింది. అలాగే గరిష్ఠ ఛార్జీ పరిమితి ప్రస్తుతం 10వేలు ఉండగా దాన్ని 13వేలకు పెంచారు. అదే సమయంలో ఈ ఏడాది మార్చి 31వరకూ విమానయాన సంస్థల సామర్ధ్యంలో 80శాతం సర్వీసులే నిర్వహించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.
అయితే ఒక్క ఇండిగో మినహా ఏ విమానయాన సంస్థ కూడా గతేడాదితో పోల్చితే 70శాతం కార్యకలాపాలను నిర్వహించలేకపోతున్నాయి. అయితే ఈ నిర్ణయం మాత్రం వీక్ బ్యాలెన్స్ షీట్ ఉన్న స్పైస్‌జెట్, గో ఎయిర్ వంటి సంస్థలకు ఇది ప్రయోజనం కలిగించనుంది. ఆ సంస్థలు ఇప్పటికిప్పుడు తమ సర్వీసులను పెంచుకునే పరిస్థితిలో లేవు.
మార్చి తర్వాత వచ్చే మూడు నెలల బుకింగ్‌లు ఆశాజనకంగా లేనందున కెపాసిటీ పరిమితి పెంచే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ఇండిగో మినహా మిగిలిన సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతం 265 విమానాలు నడుపుతున్న ఒక్క ఇండిగో మాత్రమే తన కార్యకలాపాలను విస్తరించడానికి సిద్ధంగా ఉంది. ధరలతో పాటు సర్వీసులపై పరిమితులు ఎత్తివేయాలని ఆ సంస్థ లాబీయింగ్ కూడా చేస్తోంది.