30 సార్లు ఓడినా మళ్లీ పోటీ: ఎన్నికల్లో విక్రమార్కుడి తాత

బరంపురం: అనుకున్నది సాధించేవరకూ ప్రయత్నాలను విడిచిపెట్టనివారిని విక్రమార్కుడు అంటారు. ఎన్నికల బరిలో వరుసగా ఒకసారి కాదు రెండుసార్లు కాదు పోనీ మూడో సారికూడా కాదు ఏకంగా 30సార్లు ఓడిపోయినా మళ్లీ బరిలోకి దిగేవారిని ఎన్నికల విక్రమార్కుడు అనాల్సిందే. ఆ కోవకే చెందుతారు ఒడిశాకు చెందిన శ్యాంబాబు సుబుధి.
శ్యాంబాబు సుబుధి 1962లో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటి నుంచి లోక్‌సభ, అసెంబ్లీ ఏ ఎన్నికలు వచ్చినా బరిలో నిలుస్తూనే ఉన్నారు..ఓడిపోతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నో పార్టీలు ఆయనకు టికెట్ ఆఫర్ చేసాయి. కానీ ఏ పార్టీ తరపునా కూడా పోటీ చేయలేదు. స్వతంత్ర అభ్యర్థిగా మాత్రమే బరిలోకి దిగటం శ్యాంబాబు ప్రత్యేకత. పోటీ చేసిన ప్రతిసారీ ఓడిపోవడం ఆయనకు అలవాటుగా మారింది. ఇప్పటికి 30సార్లు ఆయన ఓటమి పాలయ్యారు.
అయినప్పటికీ ఏమాత్రం వెనుకడు వేయని శ్యాంబాబు ఈ ఎన్నికల్లో కూడా మరోసారి బరిలోకి దిగారు. ఇలా వరసగా ఓడిపోతున్నా..ఏదో ఒకరోజు ప్రజలు తనను గెలిపిస్తారనే నమ్ముతున్నారాయన. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరతాననే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆస్కా, బెర్హంపూర్ (బరంపురం) లోక్‌సభ స్థానాల నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. కాగా ప్రస్తుతం ఎన్నికలు బాగా మారిపోయాయని, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్యాంబాబు సుబుధి ఎన్నికల్లో పోటీ చేసింది సాధారణ వ్యక్తులతో కాదు రాజకీయ దిగ్గజాలు పీవీ నరసింహారావు, బిజు పట్నాయక్‌ల మీద కూడా ఆయన పోటీ చేయడం గమనించాల్సిన విషయం.