ప్రపంచంలో నివసించేందుకు 2020లో అత్యంత అనువైన దేశాల్లో భారత్ టాప్ 25లో స్ధానం దక్కించుకుంది. గతేడాది కంటే రెండుస్థానాలను భారత్ ఎగబాకింది. 2019లో భారత్ ఈ జాబితాలో 27వ ర్యాంక్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. వార్టన్ స్కూల్ ఆఫ్ ది యూఎస్ సహకారంతో యూఎస్ న్యూస్ అండ్ ది వరల్డ్ రిపోర్ట్ నిర్వహించిన సర్వేలో జీవించడానికి ఉత్తమ దేశాల్లో భారత్ కంటే చైనా, సింగపూర్, దక్షిణ కొరియా, యూఏఈ వంటి నాలుగు ఆసియా దేశాలే ముందున్నాయి.
జీవించేందుకు అనువైన దేశాల్లో భారత్ స్ధానం మెరుగుపడినా దేశంలో పిల్లల ఎదుగుదల లేదా మహిళల స్థితిగతుల విషయంలో భారతదేశం గురించి ప్రజలకు మంచి అవగాహన లేదని సర్వేలో తేలింది. ఈ విభాగంలో సింగపూర్ 22వ స్ధానంలో ఉండగా అంతర్గత సమస్యలు ఎదుర్కొనే కెన్యా, ఈజిప్ట్ వంటి దేశాలు సైతం భారత్ కంటే మెరుగైన ర్యాంకులు సాధించాయి.
చిన్నారుల ఎదుగుదలకు అనువైన దేశాల్లో భారత్ 59వ స్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019తో పోలిస్తే ఈ విభాగంలో ఆరు ర్యాంకులు మెరుగుపడటమే భారత్‌కు ఊరట ఇచ్చే అంశం. గతేడాది ఈ విభాగంలో భారత్ కు 65వ స్థానం దక్కిన విషయం తెలిసిందే. భారతదేశం పిల్లలకు “మంచిది కాదు” అనే ఆందోళనకు బుధవారం(జనవరి-15,2020) భారత రైల్వే శాఖ విడుదల చేసిన నివేదిక ప్రామాణికంగా నిలిచింది. 2019 లో దేశవ్యాప్తంగా 16,457 మంది పిల్లలను రైళ్లు, రైల్వే స్టేషన్ల నుండి రక్షించినట్లు రైల్వే తెలిపింది. అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ప్రతిరోజూ దాదాపు 46 మంది పిల్లలను రక్షించింది.
మరోవైపు 2020లో మహిళల జీవనానికి అనువైన దేశాల జాబితాలో భారత్ 58వ ర్యాంక్‌తో సంతృప్తిపడాల్సి వచ్చింది. 2019తో పోలిస్తే ఈ విభాగంలో భారత్ ఒక స్ధానం దిగజారింది. పశ్చిమాసియా దేశాలు, యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియాలు భారత్ కంటే ఎగువ ర్యాంకులు సాధించాయి. ఈ సర్వేలో మన పొరుగు దేశాలు చైనా, శ్రీలంకలు సైతం మహిళలకు అనువైన జీవనం కల్పించడంలో భారత్ కంటే ముందున్నాయి.
ఇక ఆశ్చర్యకరంగా…1 లక్ష జనాభాకు 36.4 హత్యల రేటుతో దక్షిణాఫ్రికా భారతదేశపు 2.2 కన్నా చాలా ఎక్కువగా ఉంది. మరియు మొత్తం మీద అత్యాచారాల నేరాల రేటు 72.1 వద్ద ఉంది భారతదేశం యొక్కఅత్యాచారాల నేరాల రేటు 5.2 గా మాత్రమే ఉంది. అయితే దక్షిణాఫ్రికా మత్రం మహిళలకు ఉత్తమమైన దేశాల్లో భారత్ కన్నా 15 ర్యాంకుల ముందు ఉంది.