ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌.. ఇంకో వైపు ఇండియా కూటమి సభ

Delhi Liquor Scam: ఇండియా కూటమి ర్యాలీకి కూడా సునీత కేజ్రీవాల్ హాజరై ప్రసంగించే అవకాశం ఉంది.

India Bloc

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఆమ్‌ ఆద్మీపార్టీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నీడలా వెంటాడుతోంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ చివరిది కావొచ్చనే అంచనాలు తప్పాయి. ఈడీ మరికొంత మందిని విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు నోటీసులు ఇచ్చి ఐదు గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు.

లిక్కర్‌ పాలసీ డిజైన్‌లో కైలాష్ గెహ్లాట్‌ కూడా కీలకంగా వ్యవహరించారంటోంది ఈడీ. లిక్కర్‌ పాలసీని అధికారికంగా రిలీజ్‌ చేయకముందే సౌత్‌ గ్రూప్‌నకు పాలసీ డ్రాఫ్ట్‌ లీకయిందని ఈడీ ఆరోపిస్తోంది. పాలసీ డిజైన్‌ చేస్తున్న సమయంలో గెహ్లాట్‌ తన అధికారిక నివాసాన్ని ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇంఛార్జ్‌ విజయ్‌నాయర్‌కు ఇచ్చారని, గెహ్లాట్‌ తన మొబైల్‌ నంబర్లను పదే పదే మార్చారని ఈడీ ఆరోపిస్తుంది. అయితే తన అధికారిక నివాసంలో విజయ్‌నాయర్‌ ఉన్నాడన్న విషయాన్ని గెహ్లాట్‌ ఈడీ విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

మార్చి 21న ఢిలీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. మొదట వారం రోజులు ఆ తర్వాత.. మరో నాలుగురోజులు కస్టడీకి తీసుకున్నారు ఈడీ అధికారులు. సోమవారంతో కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీ ముగియనుంది. ఆ తర్వాత రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. ఈసారి బెయిల్ వచ్చేలా ప్రయత్నం చేస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. లీగల్‌గా ఉన్న అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు కేజ్రీవాల్‌ తరఫు లాయర్లు.

స్ట్రాంగ్‌‌గా రియాక్ట్
కైలాష్‌ గెహ్లాట్‌కు నోటీసులు ఇవ్వడంపై ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రాంగ్‌‌గా రియాక్ట్ అయింది. ఆప్‌ పార్టీని లేకుండా చేయాలన్నదే బీజేపీ ఎజెండా అని మండిపడ్డారు ఢిల్లీ మంత్రి అతిషి. కైలాష్‌ తర్వాత తనకు కూడా నోటీసులు ఇవ్వొచ్చని.. అయినా బీజేపీ ధమ్కీలకు భయపడేది లేదన్నారు. అన్నింటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు అతిషి.

రాంలీలా మైదానంలో భారీ ర్యాలీ
ఇక కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆదివారం ఢిల్లీ రాంలీలా మైదానంలో భారీ ర్యాలీ చేపట్టేందుకు రెడీ అయింది ఇండియా కూటమి. రిమూవ్ డిక్టేటర్‌షిప్, సేవ్ డెమోక్రసీ నినాదంతో ప్రతిపక్ష నేతలపై రాజకీయ ప్రతీకార చర్యలను తప్పుబడుతూ ర్యాలీలో గళమెత్తనున్నారు లీడర్లు.

ఈ ర్యాలీకి కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ, శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హాజరుకానున్నారు. ఈ ర్యాలీ కోసం ఇప్పటికే జోరుగా ప్రచారం చేసింది ఆప్ పార్టీ. భారీగా జనసమీకరణ చేసి సత్తా చాటాలని భావిస్తోంది

మరోవైపు ఇప్పటికే కేజ్రీవాల్ సతీమణి సునీత సోషల్ మీడియా క్యాంపెయిన్ షురూ చేశారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెల్సుకునేందుకు వాట్సాప్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. కేజ్రీవాల్‌ కో ఆశీర్వాద్ పేరుతో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా కూటమి ర్యాలీకి కూడా సునీత కేజ్రీవాల్ హాజరై ప్రసంగించే అవకాశం ఉంది.

Also Read: ఎన్నికల తర్వాత చంద్రబాబుపై మరో 10 కేసులు..!- విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు