Omicroin Variant
Omicron Variant: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వేరియంట్ ఒమిక్రాన్.. ఇండియాలోనూ వేగం పెంచింది. యూకే, డెన్మార్క్, ఫ్రాన్స్‌లలో తీవ్రంగా వ్యాపిస్తోన్న ఈ వేరియంట్ కేసులు.. ఇప్పటికే 10కుపైగా రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని స్పష్టం చేసింది. యూకే, ఫ్రాన్స్ దేశాల్లో ఒమిక్రాన్, కరోనా విజృంభిస్తున్న విషయాన్ని కేంద్రం ప్రస్తావించింది. అలాంటి పరిస్థితులు భారత్‌లో ఏర్పడితే రోజుకు లక్షలాది కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్ హెచ్చరించారు.
యూకేలోని పరిస్థితి భారత్‌లో గనుక వస్తే మన జనాభాను బట్టి రోజుకు 14 లక్షల కేసులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ పరిస్థితి వస్తే.. భారత్‌లో రోజులకు 13 లక్షల కరోనా కేసులు రికార్డవుతాయన్నారు.
యూరప్ దేశాల్లో 80 శాతం మేర సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయినప్పటికీ.. డెల్టా ఉధృతి మాత్రం తగ్గడం లేదు. ఈ సమయంలోనే ఒమిక్రాన్ వేరియంట్ యూరప్ దేశాలను వణికిస్తోంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో రోజుకు 65 వేల చొప్పున కొత్త కేసులు వస్తున్నాయి. అక్కడి పరిస్థితులతో పోలిస్తే మన జనాభా దృష్ట్యా భారత్‌లో రోజుకు 13 లక్షల కేసులు నమోదవుతాయి..! అదే విషయాన్ని మైండ్‌లో పెట్టుకోవాలంటూ రాష్ట్రాలకు తెలిపింది కేంద్రం. అలసత్వానికి ఏ మాత్రం తావు ఇవద్దని వార్నింగ్ ఇచ్చింది.
………………………….: యూపీలో మోదీ సుడిగాలి పర్యటనలు
ప్రజలంతా అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది కేంద్రం. వ్యాక్సిన్లు వేయించుకోవడం, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడాలని తెలిపింది. న్యూ ఇయర్ వేడుకలను కొద్ది మందితోనే జరుపుకొనేలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది. 20 రోజులుగా భారత్‌లో 10వేల కన్నా తక్కువ కరోనా కేసులు వస్తున్నప్పటికీ.. ఇతర దేశాల్లో కరోనా వేరియంట్ల వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని మనమంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు వీకే పాల్.