India Covid : ఆగస్టు నాటికి 10 లక్షల మరణాలు, కరోనా నియంత్రణకు చర్యలు ఎక్కడ ? లాన్సెట్ ఘాటు వ్యాఖ్యలు

భారతదేశంలో కరోనా పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ The Lancet సంచలన విషయాలు వెల్లడించింది.

Lancet

PM Modi : భారతదేశంలో కరోనా పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ The Lancet సంచలన విషయాలు వెల్లడించింది. కరోనా కారణంగా..ఇండియాలో ఆగస్టు 01వ తేదీ నాటికి 10 లక్షల మరణాలు సంభవిస్తాయని ఆందోళన కలిగించే విషయాలు వెల్లడించింది. మే 04వ తేదీ నాటికి దేశంలో నమోదైన రెండు కోట్లకు పైగా కేసులు..సంభవిస్తున్న మరణాల సంఖ్యను గుర్తు చేసింది.

సరైన నియంత్రణ చర్యలు తీసుకోకపోతే..భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఒకవేళ ఇదే జరిగితే..ఈ జాతీయ విపత్తులో కేంద్రంలోని మోదీ సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఈ సంక్షోభంలో విమర్శలు తొక్కిపెట్టిన తీరు..క్షమించరానిదిగా పేర్కొంది. భారతదేశంలో కోవిడ్ – 19 అత్యవసర పరిస్థితులున్నాయని, ఒకపక్క బాధితులతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయి..మరోపక్క మందులు, బెడ్స్, ఆక్సిజన్ అందక రోగులు అష్టకష్టాలు పడుతున్నారు..చివరకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇతరులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

అసలు కోవిడ్ – 19 నియంత్రణకు మోదీ సర్కార్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ పరిస్థితి నెలకొందని విమర్శలు గుప్పించింది లాన్సెట్. ఈ సమయంలో భారత్ సాధించిన విజయాల పట్ల కాకుండా..ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మేల్కొనాలని, బాధ్యతాయుతమైన నాయకత్వం, పారదర్శకతతో కూడిన పాలన అందించాలని సూచించింది.

ఇప్పటికైనా వ్యాక్సినేషన్‌ల ప్రక్రియను పెంచాలని, కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా..గ్రామీణ ప్రాంతాలకు కూడా టీకాలు పంపించాలని పేర్కొంది. దీనికి చెక్ పెట్టాలంటే దేశ వ్యాప్త లాక్ డౌన్, టీకా, మాస్క్, భౌతిక దూరం, స్వచ్చంద నిర్బందం, పరీక్షల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని లాన్సెట్ వెల్లడించింది.

Read More : Chinese Rocket : భూమి వైపు దూసుకొస్తున్న రాకెట్..ఎక్కడ ? ఎప్పుడు పడుతుందో తెలియదు