India : అటు అమెరికాతో దోస్తీ.. ఇటు చైనా, రష్యాతో డీలింగ్స్‌ .. ఇండియా మైండ్‌బ్లోయింగ్‌ గేమ్‌

ఉప్పు నిప్పును ఒకేసారి మ్యానేజ్‌ చేసే సత్తా. ప్రపంచంలోనే మూడు బలమైన దేశాలైన అమెరికా, రష్యా, చైనా దేశాలను భారత్ ఎలా మేనేజ్‌ చేయగలుగుతోంది? దీనికి కారణం అదేనా?

Development Of India

India : శత్రు దేశాలతో కూడా స్నేహ సంబంధాలు. ఉప్పు నిప్పును ఒకేసారి మ్యానేజ్‌ చేసే సత్తా. విదేశాంగ విధానంలో వచ్చిన మార్పులతో భారత్ ఇప్పుడు అత్యున్నత శక్తిగా ఎదుగుతోంది. ప్రపంచంలోనే మూడు బలమైన దేశాలైన అమెరికా, రష్యా, చైనా మిగిలిన అంశాలను పక్కన పెట్టి భారత్‌ వైపే చూస్తున్నాయి. ఇంతలా భారత్ ఎదగడానికి కారణం ఏమిటి..? అన్ని దేశాలను భారత్ ఎలా మేనేజ్‌ చేయగలుగుతోంది.

భాతర్ కు ఏదైనా సమస్య వస్తే.. మిత్ర దేశాల వైపు చూసేది. అది ఒకప్పుడు. ఇప్పుడలా కాదు. సాయం కోసం ఎదురు చూసే పరిస్థితి నుంచి.. ఆపన్న హస్తం అందించే స్టేజ్‌‍కు ఎదిగింది భారత్. ఎవరికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటోంది భారత్. ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర వహించే అమెరికాకు సైతం పెద్దరికం నేర్పుతోంది భారత్. తమ శత్రుదేశాలతో స్నేహంగా ఉంటున్నా.. అమెరికా భారత్‌ను పల్లెత్తు మాట కూడా  అనలేని స్థాయికి చేరుకున్నాం. దీనికి భారత విదేశాంగా విధానమే కారణంగా చెప్పొచ్చు. ప్రపంచంలో మూడు అతిశక్తివంతమైన దేశాలైన అమెరికా, రష్యా, చైనా ఇప్పుడు భారత వైపు చూడటానికి కూడా ఇదే కారణం. ఇప్పుడు ఈ మూడు దేశాలకు లింక్‌ భారత్‌ ఒక్కటేననే మాట వినిపిస్తోంది.

భవిష్యత్‌ బాగుండాలంటే.. గతాన్ని మర్చిపోవడమే అనే సూత్రాన్ని ఫాలో అవుతోంది భారత్. గతంలో ఇతర దేశాలతో జరిగిన వివాదాలను పక్కన పెట్టి .. ఇప్పుడు ముందుకు వెళ్తోంది భారత్. అదే ఇప్పుడు భారత్‌కు కలిసి వస్తోంది. ఎవరినీ నొప్పించకుండా.. తన శక్తిసామర్థ్యాలు ఏమిటో ప్రపంచ దేశాలకు తెలియజేస్తోంది. యుక్రెయిన్ యుద్ధం సమయంలో భారత్ తీసుకున్న స్టాండ్‌ వల్ల కలిగిన ఫలితాలు.. ప్రపంచ దేశాలకు కళ్లు తెరిపించాయనే చెప్పాలి. చివరికి యుక్రెయన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తున్న అమెరికా సైతం భారత్‌ను ఏమీ అనలేకపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. యుక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత్‌ స్టాండ్ అటు శాంతిని.. ఇటు స్నేహాన్ని చూపించే విధంగా ఉంది. దీంతో యుక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్‌పై రష్యా నమ్మకం మరింత పెరిగింది. రష్యా ఇటీవల తీసుకొచ్చిన ఫారిన్ పాలసి ద్వారా ఇది మరింత స్పష్టం అవుతుంది. తమ మిత్రదేశాలైన చైనా, భారత్‌తో సంబంధాలు మరింత మెరుగుపరుచుకునేలా ఈ ఫారిన్ పాలసీ ఉంది.

ఓ పక్కన ఇతర దేశాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌ మాత్రం స్థిరంగా ఉంది. దీనికి భారత ఆర్థిక విధానాలతో పాటు విదేశీ విధానాలు కూడా కారణంగా చెబుతున్నారు. జనాభా పరంగా చైనాను క్రాస్ చేసిన భారత్‌ ఇప్పుడు ప్రపంచానికి అతి పెద్ద మార్కెట్‌. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించడం ఇప్పుడు ఇతర దేశాలకు ఎంతో అవసరం. అందుకే అమెరికా ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌తో ఎప్పుడూ స్నేహంగానే ఉంటోంది. రష్యా, యుక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ నిర్ణయం.. తమ ఆలోచనకు వ్యతిరేకమైనా అమెరికా మనపై ఆంక్షలు విధించే స్థాయికి వెళ్లలేదు. ఒకవేళ భారత్‌కు దూరం జరిగితే అది ఎంత నష్టమో అమెరికాకు బాగా తెలుసు. చైనా, రష్యాతో పోటీపడాలంటే భారత్‌ స్నేహం అమెరికాకు ఎంతో అవసరం. అందుకే ఢిల్లీతో బలమైన సంబంధాల కోసం వాషింగ్టన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారత్‌లో జరిగే జీ20 సమావేశాల కోసం సెఫ్టెంబర్ నెలలో.. మన దేశానికి వస్తున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. జీ20 సమావేశాల సమయంలో భారత్, అమెరికా మధ్య మరిన్ని దైపాక్షిక అంశాలపై ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అటు అమెరికాతో దోస్తీ కంటిన్యూ చేస్తూనే ఇటు రష్యా, చైనాతో డీలింగ్స్ చేస్తోంది భారత్. ఇప్పటికే రష్యా నుంచి చమురు పరంగా భారత్ లబ్ధిపొందుతోంది. ఇప్పుడు చైనా నుంచి కూడా సహకారం పెరుగుతోంది. భారత్, చైనా మధ్య సరిహద్దు గొడవలను పక్కన పెట్టి.. ఆర్థిక సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా రెండు దేశాలు అడుగులు వేస్తున్నాయి. భారత్‌, రష్యా మధ్య సంబంధాలు మరింత బలపడిన నేపథ్యంలో చైనా కూడా అందులో చేరాలని భావిస్తోంది. ఫలితంగా తమకు లాభం జరుగుతుందని భావిస్తోంది చైనా. వచ్చే వారం ఢిల్లీలో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో చైనా రక్షణ మంత్రి లీషాంగ్‌ఫూ, రష్యా డిఫెన్స్ మినిస్టర్ సెర్గీ షోయగు పాల్గొనున్నారు. ఈ సమావేశంలో మూడు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.