India, Japan Sign Key Pact 5జీ టెక్నాలజీ, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లలో సహకారానికి సంబంధించి భారత్, జపాన్ మధ్య కీలక ఒప్పందం ఖరారైంది. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. చైనా టెలీకమ్యూనికేషన్ దిగ్గజం హువావే 5జీ సేవలపై ప్రపంచవ్యాప్తంగా విముఖత కనిపిస్తున్న నేపథ్యంలో భారత్-జపాన్ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశ భద్రతకు ముప్పు ఉందనే కారణంతో ఇప్పటికే హువావేను అమెరికా నిషేధించిన విషయం తెలిసిందే. ఇతర దేశాలను కూడా ఈ సాంకేతికత వినియోగించవద్దని అమెరికా ఒత్తిడి తెస్తోంది.
డిజిటల్ సాంకేతికత ప్రాముఖ్యాన్ని గుర్తించి భారత్, జపాన్ విదేశాంగ మంత్రులు.. సైబర్ సెక్యూరిటీ ఒప్పందాన్ని అంగీకరించారు. సంక్లిష్ట సమాచార వ్యవస్థ, 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాల్లో సామర్థ్యం పెంపు, పరిశోధన, అభివృద్ధి, భద్రత వంటి రంగాల్లో ఇరు దేశాల సహకారం ఈ ఒప్పందంతో మరింత పెరుగుతుందని భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయని విదేశాంగ శాఖ తెలిపింది.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ అనంతరం బుధవారం జపాన్ విదేశాంగ మంత్రి తొషిమిషు మోతెగి ఓ ప్రకటన చేశారు. ఇండో పసిఫిక్ మహాసముద్ర కార్యక్రమాలు(IPOI)లో కనెక్టివిటీ పిల్లర్ లో ప్రధాన భాగస్వామిగా ఉండేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఐపీఓఐ అనేది భారత్ ఆధారిత ఫ్రేమ్ వర్క్. చైనా దుందుడుకు చర్యలు పెరిగిపోతున్న ఇండో-పసిఫిక్ లో సురక్షిత, భద్రతతో కూడిన సముద్ర విధానాలను రూపొందించే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది.
సమావేశంలో భాగంగా సముద్ర భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, తయారీ రంగం, మౌలిక వసతులు, కనెక్టివిటీ, ఐరాసలో సంస్కరణలపై ఇరు నేతలు విస్తృతంగా చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలను సాధ్యమైనంత త్వరగా సాకారం చేసేందుకు కలిసి ముందు సాగడంపైనా ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు.
A Memorandum of Cooperation has been signed with Japan wherein mutual exchange of knowledge and technology on cybersecurity & other cooperation will be done between the two nations: Union Minister Prakash Javadekar pic.twitter.com/6LKwsSpPP4
— ANI (@ANI) October 7, 2020